శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ను పరిశీలించిన మంత్రులు ఉత్తమ్, శ్రీధర్ బాబు
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ను పరిశీలించిన మంత్రులు ఉత్తమ్, శ్రీధర్ బాబు
Minister


నిజామాబాద్, 01 ఆగస్టు (హి.స.)

రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధరాబాబులు నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ (ఎస్ఆర్ఎస్పీ) ప్రాజెక్ట్ను పరిశీలించారు. అధికారులతో కలిసి ప్రాజెక్టు వద్దకు చేరుకున్న మంత్రులు జలాశయంలో ప్రస్తుత నీటి మట్టం వివరాలను, ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద ప్రవాహ పరిస్థితిని ఆరా తీశారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ఎస్సారెస్పీ తెలంగాణ రాష్ట్రానికే గర్వకారణమని, ప్రాజెక్టులోని పూడికతీతపై త్వరలోనే స్పష్టమైన ప్రణాళికలు సిద్ధం చేస్తామని తెలిపారు. అలాగే ఆయకట్టుకు నీటి విడుదలపై రాబోయే రెండు రోజుల్లో స్పష్టత ఇస్తామని వెల్లడించారు.

ఇదే సమయంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీపై మంత్రి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై బీఆర్ఎస్ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. దెబ్బతిన్న ఆ మూడు బ్యారేజీలను పునరుద్ధరించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఎల్లంపల్లి ప్రాజెక్టును నిర్మించింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, దానిపై కూడా బీఆర్ఎస్ అసత్య ప్రచారాలు చేస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ హయాంలో నిర్మించిన డ్యామ్లు 60 ఏళ్లైనా చెక్కుచెదరకుండా బలంగా నిలిచాయని, కానీ బీఆర్ఎస్ హయాంలో కట్టిన ప్రాజెక్టులు మాత్రం కొద్ది కాలానికే దెబ్బతిన్నాయని మంత్రి ఉత్తమ్ విమర్శించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande