అసెంబ్లీలో విద్వేషపూరిత ప్రసంగాల నిరోధానికి చట్టం తెస్తాం: మంత్రి పొన్నం ప్రభాకర్
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఛాంబర్లో సెలక్ట్ కమిటీ సమావేశం శనివారం జరిగింది.
Ponnam prabhakar


హైదరాబాద్, 01 ఆగస్టు (హి.స.) తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఛాంబర్లో సెలక్ట్ కమిటీ సమావేశం ఈరోజు(శనివారం) జరిగింది. సెలక్ట్ కమిటీ చైర్మన్ మంత్రి పొన్నం ప్రభాకర్ (Telangana Minister Ponnam Prabhakar) అధ్యక్షతన ఈ భేటీ నిర్వహించారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు, క్రైం బిల్లుపై సెలక్ట్ కమిటీ చర్చించింది. అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ముగిసేలోపు ఓ నివేదికను సమర్పించే దిశగా ఈ కమిటీ కార్యాచరణ రూపొందించనుంది. ఈ సమావేశంలో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, కమిటీ సభ్యులు దానం నాగేందర్, మధుసూదన్ రెడ్డి, యశస్విని రెడ్డి, కవ్వంపల్లి సత్యనారాయణ, కోవా లక్ష్మి, కూనంనేని సాంబశివరావు, మాణిక్ రావు పాల్గొన్నారు. మరోసారి హేట్ బిల్, స్పీచ్ బిల్లు కాపీలను సభ్యులందరికీ చైర్మన్ పొన్నం ప్రభాకర్ ఇచ్చారు. అనంతరం మంత్రి పొన్నం మీడియాతో మాట్లాడారు.

వారం రోజుల్లో మరోసారి తమ కమిటీ సమావేశం కానుందని తెలిపారు. వచ్చే సమావేశంలో సభ్యులందరీ నుంచి సూచనలను తీసుకుంటామని చెప్పుకొచ్చారు. అసెంబ్లీలో విద్వేషపూరిత ప్రసంగాల నిరోధానికి చట్టం తీసుకువస్తామని స్పష్టం చేశారు. శాసనసభలో విద్వేషపూరిత ప్రసంగాలు చేయకుండా తమ కమిటీ నివేదిక సిద్ధం చేస్తుందని తెలిపారు. ఆయా రాజకీయ పార్టీలతో పాటు సమాజంలో పేరొందిన వారి సలహాలు తీసుకుంటామని అన్నారు. వ్యక్తుల గౌరవం కాపాడే విధంగా తమ కమిటీ నివేదిక ఉంటుందని వివరించారు. భావప్రకటన స్వేచ్ఛకు భంగం కలిగించబోమని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande