
పలమనేరు, 01 ఆగస్టు (హి.స.) ప్రయాణికుల భద్రత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం రాజీపడదని రాష్ట్ర రవాణా, యువజన, క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు.
అన్నమయ్య జిల్లాలోని పలమనేరు డిపోకు చెందిన AP39 UY 9691 హైర్ సర్వీస్ బస్సు డ్రైవర్ కె. గణేష్ కుమార్ (బ్యాడ్జ్ నెం. 3534) పలమనేరు–మదనపల్లె మార్గంలో విధులు నిర్వహిస్తూ సెల్ఫోన్ ఉపయోగిస్తూ వాహనం నడిపినట్లు ఓ ప్రయాణికుడు వీడియో తీసి అధికారులకు పంపించారు.
ఈ విషయం మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి దృష్టికి వచ్చిన వెంటనే ఆయన తీవ్రంగా స్పందించి, సంబంధిత డ్రైవర్పై తక్షణ చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. మంత్రి ఆదేశాల మేరకు పలమనేరు డిపో మేనేజర్ వెంటనే విచారణ జరిపి, డ్రైవర్ సెల్ఫోన్ ఉపయోగిస్తూ బస్సు నడిపినట్లు గుర్తించి, తక్షణ ప్రభావంతో విధుల నుంచి ఉపసంహరించారు. ఈ మేరకు సంబంధిత అధికారులకు ఉత్తర్వులు జారీ చేశారు. డ్రైవింగ్ సమయంలో సెల్ఫోన్ వినియోగం అత్యంత ప్రమాదకరమైన చర్య అని, ప్రయాణికుల ప్రాణాలకు ముప్పు కలిగించే ఇటువంటి నిర్లక్ష్యాన్ని ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోదని మంత్రి స్పష్టం చేశారు. ప్రయాణికుల భద్రతకు భంగం కలిగించే విధంగా వ్యవహరించే సిబ్బందిపై కఠిన క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరిస్తూ, ప్రజలు కూడా ఇలాంటి ఘటనలను గుర్తించిన వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేసి భద్రతా చర్యలకు సహకరించాలని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV