
హైదరాబాద్, 01 ఆగస్టు (హి.స.)
తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల ఎగువ పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి నదికి వరద ఉధృతి ప్రమాదకరంగా పెరుగుతోంది. ఎగువ నుంచి వస్తున్న లక్షలాది క్యూసెక్కుల వరద నీరు ఆంధ్రప్రదేశ్ వైపు పోటెత్తుతుండటంతో, రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) గోదావరి పరివాహక జిల్లాల యంత్రాంగాన్ని అత్యంత అప్రమత్తం చేసింది.
ఎగువన కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాలతో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం వేగంగా పెరుగుతూ 56 అడుగులు దాటి ప్రవహిస్తోంది. అక్కడ మూడో ప్రమాద హెచ్చరిక (53 అడుగులు) అమలులో ఉంది. దీని ప్రభావంతో పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే వద్ద నీటిమట్టం 30 మీటర్లకు చేరుకోవడంతో, వరద నీటిని దిగువకు విడుదల చేయడానికి ప్రాజెక్టుకు సంబంధించిన 48 గేట్లను పూర్తిగా ఎత్తివేసి భారీగా నీటిని వదులుతున్నారు. పోలవరం ముంపు ప్రాంతాల పరిధిలోని కనీసం 189 గ్రామాలు శబరి, గోదావరి నదుల వరద ముప్పును ఎదుర్కొంటున్నాయి. అటు రాజమహేంద్రవరం సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ (ధవళేశ్వరం) వద్ద ఇన్-ఫ్లో 8.93 లక్షల క్యూసెక్కులు దాటిపోవడంతో, ఈరోజు రాత్రికి మొదటి ప్రమాద హెచ్చరిక (10 లక్షల క్యూసెక్కులు) జారీ చేసే అవకాశం ఉంది. శనివారం అర్ధరాత్రి లేదా ఆదివారం నాటికి ఇన్-ఫ్లో 13 నుండి 15 లక్షల క్యూసెక్కులకు చేరి రెండో ప్రమాద హెచ్చరిక జారీ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
గోదావరి ఉధృతి కారణంగా డాక్టర్ బి.ఆర్. Ambedkar కోనసీమ జిల్లా పరిధిలోని సుమారు 32 లంక (ద్వీప) గ్రామాలకు ప్రధాన భూభాగంతో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. రక్షణ చర్యల్లో భాగంగా నదిలో పడవల (Boats) రాకపోకలను అధికారులు పూర్తిగా నిషేధించారు. వరద నీరు వెనక్కి తన్నడంతో పర్యాటక ప్రాంతాలైన పాపికొండలు బోటింగ్ సర్వీసులు, గండి పోచమ్మ ఆలయ దర్శనాలు, మోతుగూడెం, మారేడుమిల్లి జలపాతాలను తాత్కాలికంగా మూసివేశారు. రాజమహేంద్రవరం సమీపంలోని ములకల్లంక కాజ్వే వరద నీటికి కొట్టుకుపోయింది.
రక్షణ చర్యల పర్యవేక్షణలో భాగంగా అమలాపురం, రాజమహేంద్రవరం, చింతూరు, వి.ఆర్.పురం, జంగారెడ్డిగూడెం ప్రాంతాలలో ఎన్డీఆర్ఎఫ్ (NDRF), ఎస్డీఆర్ఎఫ్ (SDRF) బృందాలను రంగంలోకి దించారు. లోతట్టు, ముంపు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. వరద సహాయం మరియు అత్యవసర సమాచారం కోసం ప్రభుత్వం 112, 1070 మరియు 1800-425-0101 టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్ నంబర్లను అందుబాటులోకి తెచ్చింది. ప్రజలు పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు దాటవద్దని, చేపల వేట లేదా స్నానాల కోసం నదిలోకి దిగవద్దని అధికారులు కఠిన హెచ్చరికలు జారీ చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi