
తిరుమల, 01 ఆగస్టు (హి.స.)అధికమాసం కారణంగా తిరుమలలో ఈ ఏడాది శ్రీవారికి రెండు బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఇందుకు సంబంధించి టీటీడీ అధికారులు ఏర్పాట్లు ప్రారంభించారు. సెప్టెంబరు 15 నుంచి 23వ తేదీ వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు, అక్టోబరు 12 నుంచి 20 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నారు. రోజూ ఉదయం 8 నుంచి 10 గంటల వరకు రాత్రి 7 నుంచి 9 గంటల వరకు వాహనసేవలు జరగనున్నాయి.
బ్రహ్మోత్సవాల్లో ప్రతి రోజు ఉదయం 8 నుండి 10 గంటల వరకు తిరిగి సాయంత్రం 7 గంటల నుండి 9 గంటల వాహన సేవలు ఉంటాయి. వీటి వివరాల్లోకి వెళితే.. సెప్టెంబర్ 15 సాయంత్రం ధ్వజారోహణం, రాత్రి 9 గంటలకు పెద్ద శేష వాహనం. సెప్టెంబర్ 16న ఉదయం 8 గంటలకు చిన్న శేష వాహనం, మధ్యాహ్నం 1 నుండి 3 గంటల వరకు స్నపనం, రాత్రి 7 గంటలకు హంస వాహనం. సెప్టెంబర్ 17న ఉదయం 8 గంటలకు సింహ వాహనం, రాత్రి 7 గంటలకు ముత్యపు పందిరి వాహనం. సెప్టెంబర్ 18న ఉదయం 8 గంటలకు కల్పవృక్షం వాహనం, రాత్రి 7 గంటలకు సర్వ భూపాల వాహనం,
సెప్టెంబర్ 19న ఉదయం 8 గంటలకు మోహినీ అవతారం, సాయంత్రం 6:30 నుండి రాత్రి 11:30 గంటల వరకు గరుడ వాహనం. సెప్టెంబర్ 20న ఉదయం 8 గంటలకు హనుమంత వాహనం, సాయంత్రం 4 గంటలకు స్వర్ణ రథం, రాత్రి 7 గంటలకు గజ వాహనం. సెప్టెంబర్ 21న ఉదయం 8 గంటలకు సూర్యప్రభ వాహనం, మధ్యాహ్నం 1 నుండి 3 గంటల వరకు స్నపనం, రాత్రి 7 గంటలకు చంద్రప్రభ వాహనం, సెప్టెంబర్ 22న ఉదయం 7 గంటలకు రథోత్సవం, రాత్రి 7 గంటలకు అశ్వ వాహనం, సెప్టెంబర్ 23న ఉదయం 6 నుండి 9 వరకు చక్రస్నానం, రాత్రి ధ్వజ అవరోహణం.
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ పకడ్బందీ ఏర్పాట్లలో నిమగ్నమైంది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించింది. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు, నవరాత్రి బ్రహ్మోత్సవాలు, పెరటాసి శనివారాల సందర్భంగా తిరుమల, తిరుపతికి అధిక సంఖ్యలో వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని ఆదేశించింది. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని టీటీడీ జేఈవో డాక్టర్ ఎ. శరత్ అధికారులను ఆదేశించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV