లంక లపల్లి గ్రామ సమీపంలో నేడు తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం
లంక లపల్లి గ్రామ సమీపంలో నేడు తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం
accident


కుక్కునూరు, 17 ఆగస్టు (హి.స.)

: మండలంలోని లంకలపల్లి గ్రామ సమీపంలో సోమవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. మరో ఇద్దరు గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే.. తెలంగాణ రాష్ట్రం మణుగూరు ప్రాంతానికి చెందిన వనమాల వెంకటేశ్వర్లు కుటుంబం వాడపల్లి శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో తమ పెద్ద కుమార్తె వివాహాన్ని జరిపించారు. అనంతరం వారంతా కారులో మణుగూరుకు తిరుగుపయనమయ్యారు. మార్గంమధ్యలో లంకలపల్లి గ్రామ సమీపంలోకి రాగానే వీరు ప్రయాణిస్తున్న కారు కల్వర్టును ఢీకొని, రోడ్డు పక్కనే ఉన్న వాగులో పడిపోయింది. ఈ ప్రమాదంలో వనమాల వెంకటేశ్వర్లు భార్య వనమాల లక్ష్మి(40) అక్కడికక్కడే మృతి చెందగా.. వారి కుమార్తె వనమాల దేవి(14), మరో వ్యక్తి బతుల రాము(40) గాయపడ్డారు. ప్రమాద సమయంలో కారులో మొత్తం ఐదుగురు ఉన్నారు.

సమాచారం అందుకున్న కుక్కునూరు ఎస్సై, హెచ్సీ సుకుమార్ ఘటనాస్థలికి చేరుకుని గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande