బీసీ మహిళలకు 100 శాతం సబ్సిడీ పై ఆటోమెటిక్ కుట్టుమిషన్లు : జోగులాంబ జిల్లా కలెక్టర్
బీసీ మహిళలకు 100 శాతం సబ్సిడీ పై ఆటోమెటిక్ కుట్టుమిషన్లు : జోగులాంబ జిల్లా కలెక్టర్
Collector


జోగులాంబ గద్వాల, 20 ఆగస్టు (హి.స.)

రాష్ట్రంలోని బీసీమహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి, పారిశ్రామిక వేత్తలుగా ప్రోత్సహించే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 100 శాతం సబ్సిడీ పై ఆటోమేటిక్ కుట్టు మిషన్లను అందించే కార్యక్రమాన్ని చేపట్టిందని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ గురువారం ప్రకటనలో తెలిపారు. బీసీ సంక్షేమ శాఖ మార్గదర్శకాల ప్రకారం ప్రతి శాసనసభ నియోజకవర్గానికి 1,000 ఆటోమేటిక్ కుట్టు మిషన్లను, ఒక్కో యూనిట్కు రూ.12,000 చొప్పున 100 శాతం సబ్సిడీ పై అర్హులైన బీసీ మహిళలకు అందజేయనున్నారు. దరఖాస్తుదారులు బీసీ వర్గానికి చెందిన నిరుద్యోగ మహిళ అయి ఉండాలి. నిరాశ్రయులు, వితంతువులు, ఒంటరి మహిళలు, అనాథలు, మేరా/మేరు (మేర /మేరు) కమ్యూనిటీకి చెందిన వారికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. దరఖాస్తుదారుల వయస్సు 18 నుంచి 55 సంవత్సరాల మధ్య ఉండాలి. కుటుంబ వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2.00 లక్షలకు మించకూడదు. తెల్ల రేషన్ కార్డు/ఫుడ్ సెక్యూరిటీ కార్డు లేదా ఆదాయ ధ్రువీకరణ పత్రం సమర్పించాలి.

ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే అవకాశం ఉంటుంది. కుట్టు వృత్తిలో నైపుణ్యం కలిగిన వారికి, కనీస ప్రాథమిక అక్షరాస్యత ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది. అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్ 15వ తేదీలోగా https://tgobmms.cgg.gov.in ద్వారా మాత్రమే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుల క్షేత్రస్థాయి పరిశీలన కోసం మండలాల వారీగా ఎంపీడీఓ/మున్సిపల్ కమిషనర్ కన్వీనర్లుగా మండల స్థాయి కమిటీలను ఏర్పాటు చేయడం జరిగింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande