
హైదరాబాద్, 17 ఆగస్టు (హి.స.)
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తోందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆరోపించారు. కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను కొనసాగించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు సోమవారం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి స్థానిక మహిళలతో కలిసి మహేశ్వరం మండల కేంద్రంలోని తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పేదింటి ఆడబిడ్డలకు పెళ్లి భారం కాకూడదనే ఉద్దేశంతో కేసీఆర్ కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ప్రవేశపెట్టారని తెలిపారు. ఈ పథకాలు నిరుపేద కుటుంబాలకు ఎంతో అండగా నిలిచాయని అన్నారు.
కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద లబ్ధిదారులకు చెల్లించాల్సిన మొత్తాలు పెండింగ్లో ఉన్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలతో పాటు తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చిందని, ఆ హామీని కూడా ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను రూపుమాపాలని చూస్తే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదని, పేద ప్రజల ప్రయోజనాలను కాపాడేందుకు పోరాటం కొనసాగిస్తామని సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. పేద ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలు నిరంతరాయంగా కొనసాగించేలా ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని డిమాండ్ చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు