22-A పేరుతో సామాన్యులను ఇబ్బంది పెడితే సహించబోం: మంత్రి పొంగులేటి
సామాన్యులను 22-A పేరుతో ఇబ్బంది పెడితే సహించేది లేదని తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి హెచ్చరించారు. ప్రజలను కార్యాలయాల చుట్టూ తిప్పడం, ఆయా సమస్యల్లో జాప్యం చేస్తే ఇకపై సహించబోమని వార్నింగ్ ఇచ్చారు.
Ponguleti Srinivas Reddy


హైదరాబాద్, 17 ఆగస్టు (హి.స.) సామాన్యులను 22-A పేరుతో ఇబ్బంది పెడితే సహించేది లేదని తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి (Telangana Minister Ponguleti Srinivas Reddy) హెచ్చరించారు. ప్రజలను కార్యాలయాల చుట్టూ తిప్పడం, ఆయా సమస్యల్లో జాప్యం చేస్తే ఇకపై సహించబోమని వార్నింగ్ ఇచ్చారు. 22-A భూములపై సచివాలయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఈరోజు (సోమవారం) సమీక్షా సమావేశం నిర్వహించారు. రంగారెడ్డి, మేడ్చల్ - మల్కాజిగిరి, సంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల అధికారులతో పలు కీలక అంశాలపై మంత్రి చర్చించారు.

ఫిర్యాదుల కోసం ప్రత్యేక టోల్ఫ్రీ నంబర్..

సబ్రిజిస్ట్రార్ల వారీగా ఆయా దరఖాస్తుల గురించి అధికారులతో మంత్రి మాట్లాడారు. ఫిర్యాదుల కోసం ప్రత్యేక టోల్ఫ్రీ నంబర్ ఏర్పాటు చేస్తామని మంత్రి పొంగులేటి వెల్లడించారు. ఎన్ని దరఖాస్తులు వచ్చాయి..?, ఎప్పటి నుంచి పెండింగ్లో ఉన్నాయి? అని అధికారులను ప్రశ్నించారు. పెండింగ్ దరఖాస్తులను ఎప్పటిలోగా పరిష్కరిస్తారో స్పష్టత ఇవ్వాలని ఆదేశించారు. 22-Aలో భూమి ఉందనే కారణంతో ఆ దరఖాస్తును తిరస్కరించొద్దని హుకుం జారీ చేశారు.

వాస్తవ పరిస్థితులపై సమగ్రంగా పరిశీలించాలి..

భూమి నిషేధిత జాబితాలోకి ఎందుకు వచ్చిందో ఆయా రికార్డులు, వాస్తవ పరిస్థితులపై సమగ్రంగా పరిశీలించాలని మంత్రి దిశానిర్దేశం చేశారు. నిజమైన భూ హక్కుదారులకు న్యాయం చేస్తూనే ప్రభుత్వ భూములు, ఆస్తులను కాపాడాలని ఆదేశించారు. ప్రభుత్వ భూముల రక్షణ, ప్రజల హక్కుల విషయంలో నిర్లక్ష్యం చేస్తే తీవ్రంగా పరిగణిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి హెచ్చరించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande