విద్యార్థుల భవిష్యతే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి వివేక్
విద్యార్థుల భవిష్యతే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి వివేక్
Minister


మెదక్, 17 ఆగస్టు (హి.స.)

రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక్కొక్క విద్యార్థికి లక్ష రూపాయల వరకు ఖర్చు చేస్తూ విద్యాభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ వహిస్తుందని జిల్లా ఇన్చార్జి మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు. సోమవారం చేగుంట మండలంలోని రెడ్డిపల్లిలో కస్తూర్బా గాంధీ కళాశాల నూతన భవనాన్ని ఆయన ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్సీ అంజిరెడ్డి తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలో చదివే ప్రతి విద్యార్థికి ప్రభుత్వం లక్ష రూపాయల వరకు ఖర్చు చేస్తూ విద్యాభివృద్ధికి తోడ్పాటు అందిస్తుంది అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో భవనాలు ఏర్పాటు చేసి పేద విద్యార్థులకు నాణ్యమైన భోజనంతో పాటు మంచి విద్యను అందిస్తుందన్నారు. ఉచిత నోట్ బుక్స్, టెక్స్ట్ బుక్స్ తో పాటు యూనిఫామ్ లు అందిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్విని చేసుకొని విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకొని తల్లిదండ్రుల, గురువుల కలలు నెరవేర్చాలన్నారు.

పాఠశాల చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణంకు ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని పాఠశాల ప్రిన్సిపల్ శ్రీవాణి మంత్రి దృష్టికి తీసుకురాగా వెంటనే స్పందించి ప్రహరీ గోడ ఏర్పాటు ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్సీ అంజిరెడ్డి మాట్లాడుతూ.. క్రమశిక్షణతో పాటు ప్రతి విద్యార్థి తన లక్ష్యాన్ని ఎంచుకొని ముందుకెళ్లాలి అన్నారు. చదువుతోపాటు క్రీడారంగంలో మంచి నైపుణ్యాన్ని సాధించుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థుల కోసం 'ఖేలో ఇండియా' కార్యక్రమం ద్వారా అనేక క్రీడల ను ప్రోత్సహిస్తుందన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande