నేను డబ్బులెవరికిచ్చానో చిన్నారెడ్డి చెప్పాలె.. ఎమ్మెల్యే మేఘారెడ్డి సంచలన సవాల్
నేను డబ్బులెవరికిచ్చానో చిన్నారెడ్డి చెప్పాలె.. ఎమ్మెల్యే మేఘారెడ్డి సంచలన సవాల్
MLA


వనపర్తి, 17 ఆగస్టు (హి.స.)

వనపర్తి (Wanaparthy) కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. గత ఎన్నికల్లో తన టికెట్ రాకపోవడానికి డబ్బే కారణమని మాజీ మంత్రి చిన్నారెడ్డి (Chinna Reddy) చేసిన వ్యాఖ్యలపై స్థానిక ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి (Megha Reddy) తీవ్రస్థాయిలో స్పందించారు. చిన్నారెడ్డి ఆరోపణలను ఖండిస్తూ ఆయనకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇవాళ ఆయన ప్రముఖ మీడియా ఛానల్ ప్రతినిధితో మాట్లాడుతూ.. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం శాస్త్రీయంగా సర్వే నిర్వహించి, గెలిచే అవకాశాలు ఉన్న అభ్యర్థులకే టికెట్లు కేటాయించిందని ఎమ్మెల్యే మేఘారెడ్డి స్పష్టం చేశారు. చిన్నారెడ్డి అనవసరంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

డబ్బులు ఇచ్చి తాను టికెట్ తెచ్చుకున్నానని చిన్నారెడ్డి ఆరోపిస్తున్నారని, తాను ఎవరికి డబ్బులు ఇచ్చానో వారి పేర్లను ధైర్యంగా బయట పెట్టాలని సవాల్ విసిరారు. ఇక 2014, 2018 ఎన్నికల సమయంలో ఇకపై తాను పోటీ చేయబోనని, పార్టీ అధిష్టానం ఎవరికి టికెట్ ఇచ్చినా వారి గెలుపు కోసం పనిచేస్తానని చిన్నారెడ్డి చెప్పిన మాట వాస్తవం కాదా అని ఎమ్మెల్యే ప్రశ్నించారు. ఈ వయసులో చిన్నారెడ్డికి ఏమైందో అర్థం కావడం లేదని అన్నారు. వనపర్తి నియోజకవర్గంలో అనవసర వ్యాఖ్యలు చేస్తూ.. పార్టీతో పాటు తన ప్రతిష్ఠకు భంగం కలిగిస్తున్న మాజీ మంత్రి చిన్నారెడ్డిపై కాంగ్రెస్ అధిష్టాన పెద్దలకు ఫిర్యాదు చేయనున్నట్లుగా ఎమ్మెల్యే మేఘారెడ్డి వెల్లడించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande