
కర్నూలు, 17 ఆగస్టు (హి.స.)తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం చల్లబడింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి.. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వాతావరణ పరిస్థితులపై వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. సోమవారం తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. వాతావరణ శాఖ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకారం.. వాయవ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్ – ఉత్తర ఒడిశా తీరప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం బలపడి.. ఆ ప్రాంతంలోనే కొనసాగుతున్నట్లు తెలిపింది. ఇది రాబోయే 24 గంటల్లో వాయవ్య దిశగా పయనిస్తూ వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దీని ప్రభావంతో వాయవ్య, పశ్చిమ-మధ్య బంగాళాఖాతంతో పాటు ఉత్తరాంధ్ర తీర ప్రాంతాల్లో మంగళవారం వరకు గంటకు 40 నుండి 60 కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. సముద్రం అలజడిగా ఉండి, అలలు ఎగసిపడే అవకాశం ఉందని మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. ఇప్పటికే వేటకు వెళ్లిన వారు తక్షణమే తిరిగి రావాలని సూచించింది.
వాతావరణం కింద విధంగా ఉండనుంది..
అల్పపీడనం ప్రభావంతో సోమవారం (17-08-2026) శ్రీకాకుళం, విజయనగరం, పోలవరం, విశాఖ, ఏలూరు, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందంది. మన్యం, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, మార్కాపురం, ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో కొన్నిచోట్ల వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని వెల్లడించింది. మంగళవారం కూడా ఇదే పరిస్థితి ఉంటుందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV