తిరుమలలో రికార్డు స్థాయి రద్దీ.. ఏకంగా 97 వేలు దాటిన భక్తుల సంఖ్య
తిరుమలలో రికార్డు స్థాయి రద్దీ.. ఏకంగా 97 వేలు దాటిన భక్తుల సంఖ్య
తిరుమల


తిరుమల, 17 ఆగస్టు (హి.స.) ఆపదమొక్కుల వాడు శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు తిరుమల (Tirumala)కు భక్తజనం పోటెత్తారు. వరుస సెలవులు, శ్రావణ మాసం ప్రారంభం కావడంతో ఏడుకొండలు హరినామ స్మరణతో మారుమోగుతున్నాయి. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్టుమెంట్లు నిండిపోయి, భక్తులు నారాయణగిరి (Narayanagiri) ఉద్యానవనంలోని షెడ్ల వరకు సుదీర్ఘ లైన్లలో వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనం లభించడానికి దాదాపు 18 గంటల సమయం పడుతోంది. క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అధికారులు, శ్రీవారి సేవకులు నిరంతరం అన్నప్రసాదాలు, పాలు, తాగునీరు అందిస్తున్నారు.

ఒక్కరోజే 97 వేల మందికి దర్శనం.. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 97,014 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అదేవిధంగా స్వామివారికి తమ తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్న వారి సంఖ్య 37,108 గా నమోదైంది. భక్తులు స్వామివారికి సమర్పించిన కానుకల ద్వారా నిన్న ఒక్కరోజే శ్రీవారి హుండీకి రూ.3.93 కోట్ల ఆదాయం వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. భక్తుల రద్దీ దృష్ట్యా సర్వదర్శనం క్యూలైన్లు వేగంగా కదిలేలా అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. నడకదారిన వచ్చే భక్తులు, దర్శన టోకెన్లు లేనివారు వేచి ఉండే సమయాన్ని గమనించి తిరుమల ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని టీటీడీ సూచిస్తోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande