కాగజ్నగర్లో కాంగ్రెస్ వర్గాల మధ్య భగ్గుమన్న వర్గపోరు..
కాగజ్నగర్లో కాంగ్రెస్ వర్గాల మధ్య భగ్గుమన్న వర్గపోరు..
Congress


ఆసిఫాబాద్, 18 ఆగస్టు (హి.స.)

కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా

కాగజ్నగర్ వేదికగా కాంగ్రెస్ పార్టీ అంతర్గత విభేదాలు ఒక్కసారిగా బట్టబయలయ్యాయి. సిర్పూర్ నియోజకవర్గంలో నిర్వహించిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఫేజ్-2 నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశంలో పాత, కొత్త నాయకుల నడుమ ఘర్షణ వాతావరణం నెలకొంది. జిల్లా ఇన్చార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరైన ఈ అధికారిక కార్యక్రమంలోనే నాయకులు, కార్యకర్తలు రెండు వర్గాలుగా విడిపోయి పరస్పరం తీవ్రంగా నినాదాలు చేసుకున్నారు.

సమావేశం ప్రారంభమైన కొద్దిసేపటికే సీనియర్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహంతో వేదిక వద్ద నిరసనకు దిగారు. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆందోళనలు, పాదయాత్రలు చేస్తూ కష్టకాలంలో కాంగ్రెస్ జెండాను భుజాన వేసుకుని మోసిన సీనియర్లను తీవ్రంగా నిర్లక్ష్యం చేస్తున్నారని కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న కాక మొన్న బీఆర్ఎస్ నుంచి వచ్చిన వలస నాయకులకు అగ్రతాంబూలం ఇస్తూ ప్రాధాన్యత కల్పిస్తున్నారని నిప్పులు చెరిగారు.

వేదిక పై మంత్రి జూపల్లి కృష్ణారావు స్వయంగా ఉన్నారనే విషయాన్ని కూడా పక్కనబెట్టి, తమకు జరుగుతున్న అన్యాయం పై కార్యకర్తలు బిగ్గరగా నినాదాలు చేయడంతో సమావేశ ప్రాంగణంలో తీవ్ర కలకలం రేగింది. తీవ్ర వాగ్వాదం చోటుచేసుకోవడంతో పరిస్థితి చేయిదాటేలా కనిపించింది. దీంతో అక్కడే ఉన్న పోలీస్ అధికారులు తక్షణమే అప్రమత్తమై రంగంలోకి దిగారు. నిరసనకారులను అదుపులోకి తీసుకుని, నచ్చజెప్పి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అనంతరం మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ కార్యకర్తల అసంతృప్తిని, ఆవేదనను పరిగణనలోకి తీసుకుంటామని హామీ ఇచ్చారు. పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికీ తగిన గుర్తింపు లభిస్తుందని, పాత-కొత్త శ్రేణుల మధ్య త్వరలోనే సమన్వయం కుదిర్చి సమస్యను పరిష్కరిస్తామని స్పష్టం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande