
హైదరాబాద్, 18 ఆగస్టు (హి.స.)
గత బీఆర్ఎస్ (BRS) పాలనలో జరిగిన భూ అక్రమాల కంటే, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో భూ దోపిడీ రెండు రెట్లు పెరిగిందని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్, రేవంత్ రెడ్డి ప్రభుత్వాల తీరుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం ప్రజలకు కేటాయించిన భూములు, పరిశ్రమల కోసం ఇచ్చిన స్థలాలు, చివరికి ప్రభుత్వమే లేఅవుట్లు వేసి విక్రయించిన భూములను కూడా '22ఏ (22A) నిషేధిత జాబితాలో చేర్చడం దారుణమని ఈటల మండిపడ్డారు. దశాబ్దాలుగా రైతులు సాగు చేసుకుంటున్న భూములను లాక్కోవడం వెనుక భూమాఫియాకు కట్టబెట్టాలనే కుట్ర ఉందని ఆయన ఆరోపించారు.
ధరణి పోర్టల్ రద్దు చేసినా, భూములను లాక్కునే ప్రభుత్వాల ధోరణిలో ఏ మార్పు రాలేదు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం భూ దందాలకు పాల్పడితే, ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ ఆ భూములను 'సైటిల్ మెంట్' చేసుకుంటోంది అని ఈటల విమర్శించారు. గతంలో జరిగిన హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు ఖర్చు చేసిన డబ్బులు ఇలాంటి భూ దందాల ద్వారా వచ్చినవేనని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. గల్ఫ్ ఆయిల్ కంపెనీకి చెందిన భూములు ఫీనిక్స్ (Phoenix) కంపెనీ మీదుగా ఎలా చేతులు మారాయో అందరికీ తెలుసని, ఈ అక్రమాల్లో పెద్దల హస్తం ఉందని ఎంపీ పేర్కొన్నారు. పేదలకు, రైతులకు అన్యాయం చేస్తూ రియల్ ఎస్టేట్ మాఫియాలకు కొమ్ము కాయడం మానుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ అరాచకాలను అడ్డుకునే వరకు బీజేపీ పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు