
అమరావతి, 18 ఆగస్టు (హి.స.)
బీ.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలంలోని ఓడలరేవు, దుమ్మ లపేట, వాసలతిప్ప గ్రామానికి చెందిన మత్స్యకారుల బోటు సముద్రంలో గల్లంతైన ఘటనపై సీఎంఓ అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబానాయుడు సమీక్ష జరిపారు. బోటులో ఉన్న ఎనిమిది మంది మత్స్యకారుల ఆచూకీ కోసం చేపడుతున్న గాలింపు చర్యలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. గల్లంతైన బోటు, మత్స్యకారుల ఆచూకీ లభించే వరకూ గాలింపు చర్యలను ముమ్మరం చేయాలని ఆదేశించారు
ఆగస్టు 3న ఉదయం 10 గంటల సమయంలో ఓడలరేవు జెట్టి నుంచి మత్య్సకారుల బోటు చేపల వేటకు సముద్రంలోకి వెళ్లిందని అధికారులు వివరించారు. ఉదయం 11 గంటల వరకు కుటుంబసభ్యులతో ఫోన్ ద్వారా సంబంధాలు కొనసాగగా, ఆ తర్వాత ఎలాంటి సమాచారం అందలేదని తెలిపారు. బోటులో వీఎచ్ఎఫ్ సెట్తో పాటు మత్స్యకారుల వద్ద మొబైల్ ఫోన్లు కూడా ఉన్నట్లు వివరించారు. అదే రోజు సుమారు సాయంత్రం 6 గంటల ప్రాంతంలో బోటు చేపల వేట ప్రాంతానికి చేరుకుని ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
12వ తేదీ నాటికి బోటు తిరిగి రావాల్సి ఉన్నా రాలేదని... దీంతో వెంటనే ఆచూకీ కోసం ప్రత్యేకంగా గాలింపు చర్యలు చేపట్టామని అధికారులు చెప్పారు. కోస్ట్గార్డ్ నౌకలను అప్రమత్తం చేసి గాలింపు చేపడుతున్నట్లు కోస్ట్గార్డ్ కమాండెంట్ తెలిపినట్లు వివరించారు. బాధిత కుటుంబాలు ధైర్యంగా ఉండాలని, ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు భరోసా ఇచ్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ