పెద్ది విగ్రహం తొలగింపు..! నర్సంపేటలో హై టెన్షన్..
పెద్ది విగ్రహం తొలగింపు..! నర్సంపేటలో హై టెన్షన్..
High tension


వరంగల్, 18 ఆగస్టు (హి.స.)

నర్సంపేట మాజీ శాసనసభ్యులు, దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని మంగళవారం వేకువజామున అధికారులు తొలగించినట్లు తెలుస్తోంది. అర్థరాత్రి నుంచి పెద్ద మొత్తంలో బలగాలు ఆస్పత్రి పరిసరాలు సహా పాకాల రోడ్ వైపుగా మోహరించారు. పెద్ది విగ్రహాన్ని అక్కడ నుండి తరలించినట్లు సమాచారం. గద్దెను పూర్తిగా కూల్చివేశారు. సిమెంట్ ఇటుకలను అక్కడ నుండి దూరంగా తరలించారు. దగ్గరలో విధుల్లో ఉన్న పోలీసు సిబ్బంది సైతం ఫోన్లు వాడేందుకు అధికారులు నిరాకరించినట్లు తెలుస్తోంది. విగ్రహం తొలగింపు ప్రక్రియ అత్యంత గోప్యంగా పోలీసుల పహారాలో చేపట్టారు. సమాచారం తెలుసుకుని అక్కడికి వెళ్తున్న వారిని మధ్యలోనే అడ్డుకుంటున్నట్లు తెలుస్తోంది.

మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గుండెపోటుతో చికిత్స పొందుతూ జులై 31న యశోద ఆస్పత్రిలో కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పెద్ది దశ దిన కర్మ రోజున మెడికల్ కాలేజీ దగ్గర విగ్రహం పెట్టాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ముందు రోజు మెడికల్ కాలేజీ ఎదురుగా ఉన్న ప్రైవేటు స్థలంలో విగ్రహ ఏర్పాటుకు గద్దెను నిర్మించారు. ఇది అసైన్డ్ భూమి అని కొంత చర్చ జరిగిన సంగతి తెలిసిందే. కాగా మున్సిపల్ నుండి అనుమతులు లేవని గద్దెను మున్సిపాలిటీ అధికారులు కూల్చారు. అనంతరం ముందస్తు సమాచారం లేకుండా కూల్చడం పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అంబేద్కర్ సెంటర్ లో బీ.ఆర్. ఎస్ శ్రేణులు ధర్నా చేశారు. అదే రోజు సాయంత్రం విగ్రహ ప్రతిష్ట చేయడం ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ ఘటనలో మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ సహా పలువురి పై కేసులు నమోదు అయ్యాయి. మరుసటి రోజు విగ్రహం తొలగిస్తారని ప్రచారం జరిగినా అలాంటి ఘటన చోటు చేసుకోలేదు. వారం రోజులుగా పోలీసు సిబ్బంది షిఫ్ట్ ల వారీగా మెడికల్ కాలేజీ పరిసరాల్లో విధులు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన వల్ల ఆలస్యం జరిగినట్లు తెలుస్తోంది. పెద్ది విగ్రహం తొలగింపుతో పరిస్థితులు ఉద్రిక్తతగా మారే అవకాశం ఉన్నట్లు స్థానికంగా చర్చ జరుగుతోంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు అరెస్టులు చేస్తున్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గంలోని ఆరు మండల కేంద్రాల్లో పోలీసు బలగాలను మోహరిస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande