నేనే సారీ చెప్పా.. నువ్వు బయటపెట్టిందేముంది?.. హరీశ్ రావుకు పొంగులేటి కౌంటర్
నేనే సారీ చెప్పా.. నువ్వు బయటపెట్టిందేముంది?.. హరీశ్ రావుకు పొంగులేటి కౌంటర్
Minister


హైదరాబాద్, 18 ఆగస్టు (హి.స.)

22ఏతో ప్రైవేట్ ఆస్తులకు ఇబ్బంది కలిగిన మాట నిజమేనని అయితే ఈ వివాదాన్ని దాచిపెట్టాలనో, ప్రజలను మభ్యపెట్టాలనో నేను కానీ మా ప్రభుత్వం కానీ అనుకోవడం లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. జరిగిన వాస్తవం ఏంటో ప్రజలకు నిన్నే వివరించామని ఈ వివాదంలో జరిగిన పొరపాటును భేషరతుగా సరిద్దితామని చెప్పామని ఇప్పటికే సరిదిద్దే ప్రయత్నం మొదలుపెట్టామన్నారు. ఇవాళ ఓ న్యూస్ చానల్ తో మాట్లాడిన పొంగులేటి.. ప్రజల ఆస్తులను 22ఏలో ఉద్దేశపూర్వకంగానే పెట్టి వాటిని రిలీజ్ చేయడానికి డబ్బులు వసూలు చేయడానికే ఈ తతంగాన్ని నడుపుతున్నారంటూ మాజీ మంత్రి హరీశ్ రావు చేసిన ఆరోపణలపై మంత్రి స్పందించారు. హరీశ్ రావు కాదు ఆయన అబద్ధాలరావుగా మారారని ఎద్దేవా చేశారు. పొరపాటు జరిగిందని నేనే స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పానని, 22ఏ లో కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు హరీశ్ రావు తీరు ఉందని విమర్శించారు.

ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి, నిజాయితీ, నిబద్ధత ఉందని అందువల్లే తప్పు జరిగితే అంగీకరించామన్నారు. మీకు మాదిరిగా దబాయించడం లేదని, ధరణిలో మీరు ఆడిన ఆటలు, అబద్ధాలెన్నో హరీశ్ రావు గుండెల మీద చెయి వేసుకుని చెప్పాలన్నారు. ధరణి మూలంగా ప్రజలు ఆత్మహత్యలు చేసుకుంటే స్పందించని మీరా మా గురించి మాట్లాడేదన్నారు. ప్రక్షాళన చేస్తున్న క్రమంలో జరిగిన పొరపాటుకు అధికారుల పక్షాన క్షమాపణ కూడా అడిగానని ఏనాడైనా మీరు క్షమాపణ కోరారా అది మీ నిబద్దత అన్నారు. సామాన్య ప్రజలకు ఇబ్బంది పెట్టాలనో కారుకూతలు కూరే వారికి సమాధానం చెప్పాలననో చర్యలు తీసుకోవడం లేదన్నారు. 1998 నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పుడు తెలంగాణ ఏర్పడి తర్వాత కూడా ప్రభుత్వ జీవోలు, మెమోలతో హక్కులు లభించిన భూములకు సంబంధించిన కాపీలు ఆన్లైన్ లో అప్లోడ్ కాలేదని, ఆ విషయం గ్రహించకుండా హైకోర్టు ఆదేశాలతో 22ఏ జాబితాను వివిధ జిల్లాల కలెక్టర్లు ఆన్ లైన్ లో అప్ లోడ్ చేయడం కారణంగా నిషేధిత భూముల సమస్య వచ్చిందని తెలిపారు. దీన్ని గ్రహించి యుద్ధప్రాతిపాదికన చర్యలు తీసుకుంటున్నామన్నారు.

హైదరాబాద్ కోర్ ఏరియాలో న్యాయబద్ధంగా ఉన్న 22ఏ బాధితులకు వారి ఆస్తులకు పూర్తి భద్రత, రక్షణ మా ప్రభుత్వానిదన్నారు. గత ప్రభుత్వం మాదిరిగా ప్రభుత్వ భూములను వారి తొత్తులకు పంచిపెట్టడం లేదన్నారు. ఆనాడు ధరణి మాదిరిగా మొఖం చాటేయడం లేదని నాడు ధరణితో సామాన్య ప్రజలు ఇబ్బంది పడితే ఎలాంటి ఇబ్బంది లేదని బుకాయించడం లేదన్నారు. ప్రజలకు సంబంధించిన ప్రైవేట్ ఆస్తుల విషయంలో మిస్టెక్ జరిగిన వాట వాస్తవం అని అయితే వీటిని ఈ నెలాఖరులోపే పరిష్కరించాలని ఉన్నతాధికారులకు కఠిన ఆదేశాలు ఇచ్చామన్నారు. రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీ లోకేశ్, రాజీవ్ గాంధీతో పాటు మరో ముగ్గురితో ఇవాళ కమిటీ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ కమిటీ రాబోయే 15 రోజులపాటు ప్రతి రోజు హైదరాబాద్ కోర్ ప్రాంతంతో పాటు రాష్ట్రంలోని మిగిలిన 22ఏతో నిజమైన హక్కుదారుల సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తామన్నారు. ఎక్కడైనా రిజిస్ట్రేషన్ స్లాట్స్ షార్ట్ ఫాల్ అయితే వాటిని పొడిగించాలని అధికారులకు ఆదేశించామన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande