ఏజెన్సీ ప్రాంతాలను ఆదర్శ పంచాయతీలుగా తీర్చిదిద్దాలి : మంత్రి సీతక్క
ఏజెన్సీ ప్రాంతాలను ఆదర్శ పంచాయతీలుగా తీర్చిదిద్దాలి : మంత్రి సీతక్క
Seethakka


ములుగు, 18 ఆగస్టు (హి.స.)

గ్రామాల అభివృద్ధిలో గ్రామ పంచాయితీల సర్పంచ్ ల పాత్ర కీలకమని, ఏజెన్సీ ప్రాంతాలను ఆదర్శ పంచాయతీలుగా తీర్చిదిద్దాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ (సీతక్క) అన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో పీసా చట్టం అధికారాలను సద్వినియోగం చేసుకొని ఏజెన్సీ ప్రాంతాలను దేశానికే ఆదర్శంగా నిలిచే గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని తెలిపారు. మంగళవారం హైదరాబాద్ లోఎం.సి.ఆర్.హెచ్.ఆర్.డీ కేంద్ర ప్రభుత్వ సౌజన్యంతో ఏజెన్సీ ప్రాంతాలకు చెందిన మహిళా సర్పంచులకు నిర్వహిస్తున్న మూడు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని మంత్రి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. ఈ ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహకరిస్తుందని, ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకొని ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచాలని సూచించారు. సాధారణ గ్రామ పంచాయతీలకు, షెడ్యూల్డ్ ఏరియా గ్రామ పంచాయతీలకు చాలా తేడా ఉంటుందని, ఏజెన్సీ ప్రాంతాల ప్రత్యేక పరిస్థితులు, అక్కడి ప్రజల జీవన విధానం, సంస్కృతి, సంప్రదాయాలను దృష్టిలో పెట్టుకొని పాలన సాగించాల్సిన అవసరం ఉందన్నారు. పీసా చట్టం పై సర్పంచులు పూర్తిగా అవగాహన చేసుకోవాలని,

అడవులను, ప్రకృతిని తరతరాలుగా కాపాడుకుంటూ వస్తున్న ఆదివాసీలకు వారి హక్కులపై పూర్తి అవగాహన ఉండాలని అన్నారు. గ్రామసభ నిర్ణయాలకు ఎంతో ప్రాధాన్యత ఉంటుందని, పీసా చట్టం ఇచ్చిన అధికారాలను తెలుసుకోవడం కాకుండా వాటిని ఆచరణలో పెట్టడం ముఖ్యమని అన్నారు. ఐదేళ్ల పదవీ కాలంలో ప్రజల జీవితాల్లో శాశ్వతమైన మార్పు తీసుకువచ్చే అవకాశంగా ఉంటుందని, మూడు రోజుల శిక్షణలో నేర్చుకున్న విషయాలను గ్రామాలకు ప్రజలకు వివరించాలని సూచించారు. గ్రామాలలో రోడ్లు, భవనాలు నిర్మించడమే అభివృద్ధి కాదని, ప్రజలకు ఆదాయం పెరగడం, ఉపాధి అవకాశాలు పెరగడం, పిల్లలు చదువుకోవడం, ఆరోగ్యం మెరుగుపడటం, మహిళలు ఆర్థికంగా ఎదగడం కూడా అభివృద్ధిలో భాగమేనన్నారు.

ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజల ఆదాయం పెంచేందుకు ఉపాధి హామీ కార్యక్రమాలను అనుసంధానం చేసుకోవాలని, గ్రామ సభలను కేవలం అధికారిక కార్యక్రమాలుగా కాకుండా సామాజిక మార్పునకు వేదికలుగా మార్చుకోవాలని తెలిపారు. బాల్య వివాహాలను పూర్తిగా అరికట్టడం, మహిళలపై వేధింపులకు గురి కాకుండా చూడటం, పిల్లల విద్యను ప్రోత్సహించడం, పోషకాహారం, ఆరోగ్యం వంటి అంశాలపై గ్రామసభల్లో చర్చించి ప్రజలతో సామూహిక నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. ఆదివాసీ ప్రాంతాల్లో సంప్రదాయ ఆహారాలకు ప్రాధాన్యత ఇవ్వాలని, ఇప్పపువ్వు లడ్డూ, మిల్లెట్స్ బిస్కెట్లు వంటి స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించడం ద్వారా సంప్రదాయ ఆహారంతో పాటు మహిళలకు, స్థానిక కుటుంబాలకు ఆదాయ మార్గాలు కల్పించవచ్చని వివరించారు. రాజకీయాలకు అతీతంగా పాలన సాగించాలని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని ప్రజల కష్టాలను గుర్తించి అత్యవసర పరిస్థితుల్లో వారికి అండగా నిలువాలని అన్నారు. మంచి పనితీరుతో గ్రామాలను అభివృద్ధి చేస్తే రాష్ట్ర స్థాయిలోనే కాకుండా జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు, పురస్కారాలు పొందే అవకాశం ఉంటుందని తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande