తిరుమలలో పోటెత్తిన భక్తులు.. సర్వదర్శనానికి 20 గంటల సమయం
తిరుమలలో పోటెత్తిన భక్తులు.. సర్వదర్శనానికి 20 గంటల సమయం
తిరుమల


తిరుమల, 18 ఆగస్టు (హి.స.) కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి కొలువై ఉన్న తిరుమల కొండకు భక్తులు పోటెత్తారు. దీంతో స్వామి వారి సన్నిధిలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనార్థం వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలిరావడంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లు కిక్కిరిసిపోయాయి. టైమ్ స్లాట్ టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనం (ఉచిత దర్శనం) ద్వారా స్వామివారిని దర్శించుకోవడానికి సుమారు 20 గంటల సమయం పడుతోందని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు వెల్లడించారు. క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ నిరంతరాయంగా అన్నప్రసాదాలు, పాలు, తాగు నీరు అందిస్తూ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. దర్శన సమయాలు మరియు అధికారిక నవీకరణల కోసం TTD అధికారిక వార్తల పోర్టల్ ను పరిశీలించవచ్చు.

మరోవైపు నిన్న (సోమవారం) ఒక్కరోజే మొత్తం 79,445 మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా శ్రీవారి హుండీ ఆదాయం ఏకంగా రూ. 4.8 కోట్లు సమకూరింది. అలాగే శ్రీవారికి తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్న భక్తుల సంఖ్య 36,834గా నమోదైంది. భక్తుల రద్దీ విపరీతంగా పెరిగిన నేపథ్యంలో క్యూలైన్ల క్రమబద్ధీకరణ, భద్రత విషయంలో అధికారులు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారు. సర్వదర్శనం సదుపాయాలు, ఇతర సేవా వివరాల కోసం TTD అధికారిక సర్వదర్శనం గైడ్ చూడవచ్చు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande