
అమరావతి, 19 ఆగస్టు (హి.స.)
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్కూళ్లలోనూ విద్యార్థుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. గత నాలుగేళ్లుగా జననాల రేటు తగ్గుతుండడమే దీనికి కారణమని తెలుస్తోంది. 2025-26లో అన్ని మేనేజ్మెంట్ల పాఠశాలల్లో 1 నుంచి 12వ తరగతి వరకు చదివే విద్యార్థుల సంఖ్య 84.37 లక్షలుగా ఉంది. ఈ ఏడాది ఆ సంఖ్య 81.75 లక్షలకు పడిపోయింది. అంటే 2.61 లక్షల మంది విద్యార్థులు తగ్గిపోయారు. మేనేజ్మెంట్ల వారీగా చూస్తే.. ప్రైవేటు పాఠశాలల్లో 2.24 లక్షల మంది తగ్గారు. ప్రభుత్వ పాఠశాలల్లో 31 వేల మంది తగ్గారు. ఎయిడెడ్ పాఠశాలల్లో 6,375 మంది తగ్గిపోయారు. కాగా, గతేడాదితో పోలిస్తే ప్రభుత్వ పాఠశాలలు మెరుగుపడ్డాయి. ప్రైవేటు పాఠశాలల్లో మాత్రం విద్యార్థుల సంఖ్య అసాధారణ రీతిలో పడిపోయింది. గత ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో 41.4 శాతం మంది విద్యార్థులుంటే ఈ ఏడాది అది 42.34 శాతానికి చేరింది. అదే ప్రైవేటులో 57.47 శాతం నుంచి 56.57కు తగ్గింది. ఎయిడెడ్లో 1.13 శాతం నుంచి 1.09 శాతానికి తగ్గింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ