
హైదరాబాద్, 19 ఆగస్టు (హి.స.)
సనత్నగర్లోని టిమ్స్(Sanath Nagar) ఆస్పత్రి సందర్శనకు ప్రతిపక్ష బీఆర్ఎస్ అగ్రనేతలు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. మాజీ మంత్రులు తన్నీరు హరీశ్ రావు (Harish Rao), సబితా ఇంద్రా రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్లను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఆస్పత్రి సందర్శనకు వెళ్లకుండా అడ్డుకోవడంతో పాటు పలువురు నేతలను ముందస్తుగా నిర్బంధంలోకి తీసుకున్నారు.
సనత్నగర్ టిమ్స్ ఆస్పత్రికి వెళ్లకుండా నిరోధించేందుకు కోకాపేట్లోని మాజీ మంత్రి హరీశ్ రావు నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. హరీశ్ రావు హౌస్ అరెస్ట్ విషయం తెలుసుకున్న ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కోకాపేట్ (Kokapet)లోని ఆయన నివాసానికి చేరుకున్నారు. ఈ క్రమంలో హరీశ్ రావు ఇంటి పరిసర ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మరోవైపు సనత్నగర్ టిమ్స్ ఆస్పత్రి సందర్శనకు బీఆర్ఎస్ నేతలకు ఎలాంటి అనుమతి లేదంటూ పోలీసులు దౌర్జన్యంగా అడ్డుకున్నట్లుగా పార్టీ వర్గాలు తెలిపాయి.
పోలీసుల అక్రమ నిర్బంధాలు, హౌస్ అరెస్టులపై మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రంగా మండిపడ్డారు. ప్రభుత్వ వైఫల్యాలు, ఆస్పత్రుల్లోని డొల్లతనం ఎక్కడ బయటపడతాయోనన్న భయంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) ఈ అరెస్టులకు పాల్పడుతోందని ఎద్దేవా చేశారు. ప్రజా సమస్యలపై నిలదీస్తే హౌస్ అరెస్టులు చేయడం దుర్మార్గమని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అప్రకటిత ఎమర్జెన్సీని అమలు చేస్తూ, పోలీసుల నిర్బంధాలతో ప్రతిపక్షాల గొంతు నొక్కాలని చూస్తోందని హరీశ్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు