
హైదరాబాద్, 19 ఆగస్టు (హి.స.)
తెలంగాణ భారతీయ జనతా పార్టీ
(Bharatiya Janata Party) అంతర్గత వ్యవహారాలు, నాయకుల వైఖరిపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (Raja Singh) కీలక వ్యాఖ్యలు చేశారు, బీజేపీ జాతీయ కార్యవర్గంలో తెలంగాణ నేతలకు ప్రాతినిధ్యం లభించకపోవడంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ, నాయకుల తీరుపై ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. బీజేపీ జాతీయ కార్యవర్గంలో తెలంగాణ నుంచి ఒక్కరికి కూడా అవకాశం ఇవ్వకపోవడంపై రాజసింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేవారు. గతంలో రాష్ట్రానికి చెందిన పెద్ద నాయకులకు జాతీయ స్థాయిలో మంచి పదవులు ఇచ్చారని గుర్తుచేశారు. అయితే, తెలంగాణ బీజేపీలో ప్రతీసారి గ్రూప్ రాజకీయాలు నడుస్తున్నాయని, చిన్న విషయానికి కూడా ఢిల్లీ (Delhi)కి వెళ్లి ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటున్నారని ఆయన విమర్శించారు. నేతల మధ్య ఉన్న ఈ విభేదాల వల్లే 'తెలంగాణ నాయకులు మారరు' అని అధిష్టానం భావించి ఉండవచ్చని, అందుకే జాతీయ కార్యవర్గంలో చోటు కల్పించలేదని రాజాసింగ్ అభిప్రాయపడ్డారు. దేశంలో ప్రతీ రాష్ట్రంలోనూ బీజేపీని అధికారంలోకి తీసుకురావాలనే లక్ష్యంతో నితిన్ నబీన్ (Nitin Nabin) ఓ సైన్యాన్ని తయారు చేసుకున్నారని రాజాసింగ్ తెలిపారు. ఇప్పటికైనా తెలంగాణ నేతలంతా విభేదాలు మరచి, అందరూ ఒకటేనని నిరూపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పశ్చిమ బెంగాల్ తరహాలో పార్టీ నాయకులంతా ఐక్యమై, తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడానికి ఓ యుద్ధంలా పోరాడాలని పిలుపునిచ్చారు. సొంత గ్రూపు రాజకీయాలను పక్కనబెట్టి, రాష్ట్రంలో 'మన రాజ్యం' తీసుకురావడమే ధ్యేయంగా పనిచేస్తేనే పార్టీ అధిష్టానం భవిష్యత్తులో పదవులను కేటాయించే అవకాశం ఉంటుందని ఎమ్మెల్యే రాజాసింగ్ తేల్చి చెప్పారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు