ధర్మసాగర్ రిజర్వాయర్ నుంచి సాగునీటిని విడుదల చేసిన ఎమ్మెల్యే కడియం..
ధర్మసాగర్ రిజర్వాయర్ నుంచి సాగునీటిని విడుదల చేసిన ఎమ్మెల్యే కడియం..
MLA


హనుమకొండ, 19 ఆగస్టు (హి.స.)

ధర్మసాగర్ రిజర్వాయర్ నక్కల

తూము ద్వారా నీటిపారుదల శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులతో కలిసి ఎమ్మెల్యే కడియం శ్రీహరి సాగునీటిని విడుదల చేశారు. నక్కల తూము నుంచి తొలిసారి సాగునీటిని విడుదల చేయడంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఉమ్మడి జిల్లాలో తక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రాంతాలకు సాగునీరు, తాగునీరు అందించేందుకు దేవాదుల ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. దేవాదుల ద్వారా 6 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు రూపకల్పన చేయగా, 3 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించినట్లు వెల్లడించారు.

ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ముఖ్యమంత్రితో చర్చించి నెల రోజులుగా దేవాదులలోని అన్ని రిజర్వాయర్లను నింపేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం అన్ని రిజర్వాయర్లలో 50 శాతానికి పైగా నీటి నిల్వలు ఉన్నాయని అన్నారు. దేవాదుల కింద ఉన్న అన్ని రిజర్వాయర్ల నుంచి సాగునీరు విడుదల అవుతుందని, కాలువల ద్వారా వస్తున్న నీటిని రైతులు పొదుపుగా వినియోగించుకోవాలని సూచించారు. ధర్మసాగర్, ఘనపూర్, అశ్వరావుపల్లి రిజర్వాయర్ల కింద ఉన్న పాత ఆయకట్టుకు పూర్తి స్థాయిలో సాగునీరు అందించనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఇందుకోసం పంట కాలువలను పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని, రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారులు సంయుక్తంగా సర్వే నిర్వహించి నివేదిక తయారు చేయాలని సూచించారు. నెల రోజుల్లోపు కాలువల పునరుద్ధరణకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. వచ్చే యాసంగి నాటికి రిజర్వాయర్ల కింద ఉన్న పూర్తి ఆయకట్టుకు రెండు పంటలకు సాగునీరు అందించే విధంగా చర్యలు తీసుకుంటామని రైతులకు హామీ ఇచ్చారు. అలాగే నక్కల తూము నుంచి విడుదల చేసిన సాగునీరు చివరి ఆయకట్టు వరకు చేరేలా కాలువల సర్వే, పునరుద్ధరణకు సహకరించేందుకు 10 మంది రైతులతో ఒక కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో నీటిపారుదల శాఖ సీఈ సుధీర్, ఎస్ఈ మంగీలాల్, డీఈలు, ఏఈలు, వివిధ గ్రామాల సర్పంచులు, మండల నాయకులు, కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande