
కరీంనగర్, 19 ఆగస్టు (హి.స.)
కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం సైదాపూర్ మండలంలోని దుద్దెనపల్లిలో 'పల్లె పల్లెకు పొన్నం అన్న.. పల్లె పల్లెలో ప్రజా పాలన' కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. గ్రామంలో రూ.20 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన పల్లె దవాఖానను మంత్రి ప్రారంభించారు అనంతరం రైతు వేదికలో నిర్వహించిన 'పల్లె పల్లెకు పొన్నం అన్న.. పల్లె పల్లెలో ప్రజా పాలన' కార్యక్రమంలో గ్రామ ప్రజలు, రైతులు, మహిళా సంఘాల ప్రతినిధులతో మంత్రి నేరుగా మాట్లాడి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల నుంచి వినతిపత్రాలను స్వీకరించి, సంబంధిత అధికారులతో అక్కడికక్కడే మాట్లాడి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజల సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించడమే ప్రజా పాలన ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాఖడే, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి భాగ్యలక్ష్మి, డీఆర్డీఏ గీతా, డీఎంహెచ్వో రాజగోపాల్, ఆర్డీవో జలకుమారి, మార్కెట్ కమిటీ చైర్మన్ దొంత సుధాకర్, మండల పార్టీ అధ్యక్షుడు చాడకొండాల్ రెడ్డి, సర్పంచ్ ఉడిగే విజయ రాజశేఖర్తో పాటు అన్ని శాఖల జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..