
హైదరాబాద్, 02 ఆగస్టు (హి.స.) భాగ్యనగరంలో లష్కర్ బోనాల సందడి నెలకొంది. ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనాలు (Ujjaini Mahankali Temple Bonalu) సమర్పించేందుకు భక్తులు పోటెత్తారు. భక్తులతో 200 ఏళ్ల చరిత్ర గల మహంకాళి ఆలయం, సికింద్రాబాద్ పరిసర ప్రాంతాలు కిటకిటలాడుతున్నాయి. బోనాలు సమర్పించేందుకు తెల్లవారుజాము నుంచే భక్తులు క్యూ కట్టారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున అమ్మవారికి తొలి బోనాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ సమర్పించారు. సాధారణ భక్తుల కోసం 3 క్యూ లైన్లు, బోనాల సమర్పించే భక్తుల కోసం రెండు క్యూలైన్లు ఏర్పాటు చేశారు.
2,500 మంది పోలీసులతో భద్రత..
ఈరోజు (ఆదివారం), రేపు (సోమవారం) సికింద్రాబాద్లో బోనాల జాతర కొనసాగనుంది. రేపు అమ్మవారి రంగం భవిష్యవాణి కార్యక్రమం జరగనుంది. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా దేవాదాయ శాఖ ఏర్పాట్లు చేసింది. లక్షలాది మంది భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో పోలీస్ బందోబస్తు, సీసీటీవీ కెమెరాలతో పర్యవేక్షిస్తున్నారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా ప్రత్యేకంగా వాటర్ క్యాంప్స్ ఏర్పాటు చేశారు. వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప్స్, అంబులెన్స్లు ఏర్పాటు చేశారు. శివసత్తులకు మధ్యాహ్నం 1 గంటల నుంచి 3 గంటల వరకు సమయం కేటాయించారు. ఆదివారం రాత్రి, సోమవారం రాత్రి అమ్మవారి ఫలహర బండ్ల ఊరేగింపు జరగనుంది. ఆలయ పరిసర ప్రాంతాల్లో 2,500 మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు. అలాగే, అమ్మవారికి హైదరాబాద్ సీపీ సజ్జనార్ దంపతులు బోనం సమర్పించారు.
రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాల్లో బోనాలు ప్రత్యేకం: పొన్నం ప్రభాకర్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల్లో బోనాలు ప్రత్యేకమని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలపై అమ్మవారి కరుణా కటాక్షాలు ఉండాలని కోరుకున్నానని తెలిపారు. సమృద్ధిగా వర్షాలు పడాలని వేడుకున్నానని పేర్కొన్నారు. ఈరోజు 11:30గంటలకు సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాలకు సీఎం రేవంత్రెడ్డి హాజరవుతారని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్