
నల్లగొండ, 02 ఆగస్టు (హి.స.) ఎస్ఎల్బీసీ సొరంగ మార్గాన్ని పూర్తి చేయడమే తన లక్ష్యమని తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Telangana Minister Komatireddy Venkat Reddy) వ్యాఖ్యానించారు. ఎస్ఎల్బీసీ సొరంగం మార్గం ద్వారా రెండు పంటలకు నీరు ఇచ్చి జిల్లాను సస్యశ్యామలం చేస్తామని పేర్కొన్నారు. ఈరోజు (ఆదివారం) నల్లగొండ మండలం కంచనపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి మాట్లాడారు. బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు ద్వారా ఈ ప్రాంతంలో ప్రతి ఎకరానికి సాగునీరు అందజేస్తామని చెప్పుకొచ్చారు.
కంచనపల్లి గ్రామాన్ని మోడల్గా అభివృద్ధి చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెల్లడించారు. దోమలపల్లి గ్రామంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేసి ఈ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందజేస్తామని తెలిపారు. మూడేళ్లు నల్గొండ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించి అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. వారానికి రెండు రోజుల పాటు నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉంటామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్