
తిరుమల, 02 ఆగస్టు (హి.స.) తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి ఉచిత సర్వదర్శనం కోసం వచ్చిన భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్సులోని 31 కంపార్టుమెంట్లు నిండిపోయాయి. ఉదయం 8 గంటల తర్వాత క్యూలైన్లోకి ఎలాంటి టోకెన్ లేకుండా సర్వదర్శనానికి వెళ్లే భక్తులకు స్వామివారి దర్శనానికి 10-12 గంటల సమయం పడుతుంది. అలాగే రూ.300 టోకెన్లు ఉన్న భక్తులకు 3-4 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. సర్వదర్శనం టోకెన్ పొందిన భక్తులకు 4-6 గంటల సమయం పడుతుందని తెలిపారు. కాగా.. స్వామివారిని నిన్న (శనివారం) 86,231 మంది భక్తులు దర్శించుకున్నారు. 32,017 మంది భక్తులు నిన్న స్వామివారికి తలనీలాల మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకలతో స్వామివారి హుండీ ఆదాయం రూ.3.74 కోట్లు సమకూరింది. అలాగే 4.73 లక్షల లడ్డూలను విక్రయించారు.
మరోవైపు శ్రీవారి పుష్కరిణిని 40 రోజుల పాటు మూసివేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. పుష్కరిణి రిపేర్ వర్క్స్ లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 10 వరకూ శ్రీవారి పుష్కరిణి మూసివేసి ఉంటుందని, పుష్కరిణి హారతి, భక్తులకు ప్రవేశాన్ని 40 రోజుల పాటు నిషేధించినట్లు పేర్కొంది. ఇందుకు భక్తులు సహకరించాలని కోరింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV