
కర్నూలు, 02 ఆగస్టు (హి.స.) ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ (IMD) వర్ష హెచ్చరికలు జారీ చేసింది. సముద్రం నుంచి వీస్తున్న తేమగాలులు, రాష్ట్రమంతటా కొనసాగుతున్న వాతావరణ మార్పుల ప్రభావంతో రానున్న రోజుల్లో పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ముఖ్యంగా శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లో పలుచోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. అలాగే విజయనగరం, మన్యం, కోనసీమ, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, కర్నూలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV