
శ్రీశైలం, 02 ఆగస్టు (హి.స.) ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా నదులు, వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ప్రాజెక్టులకు జలకళ వచ్చింది. ఇక శ్రీశైలం ప్రాజెక్టు సైతం నిండిపోయింది.
ప్రాజెక్టులో బ్యాక్ వాటర్ పెరగడంతో శ్రీ సంగమేశ్వర క్షేత్రాన్ని కృష్ణా జలాలు చుట్టు ముట్టాయి. నీటిమట్టం పెరగడంతో వేపదారు శివలింగానికి పురోహితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గంగమ్మ తల్లికి ఆలయ ప్రధాన అర్చకులు తెలకపల్లి రఘురామ శర్మ భక్తిశ్రద్ధలతో చీర, సారె సమర్పించారు. ప్రాజెక్టుకు కృష్ణా జలాలు సంపూర్ణంగా ముంచెత్తడంతో కొద్ది నెలల పాటు వేపదారు శివలింగం నీటిలోనే దర్శనం ఇవ్వనుంది. ప్రతిఏడాది వర్షాకాలం వచ్చిందంటే ఈ ఆలయం చుట్టూ నీరు చేరుతుంది. ఆలయం సైతం నీటితో నిండిపోతుంది. అయినప్పటికీ భక్తుల రద్దీ మాత్రం తగ్గదు. పడవల్లో వచ్చి సైతం శివుడిని దర్శించుకుని భక్తులు పూజలు చేస్తుంటారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV