
విశాఖ:, 20 ఆగస్టు (హి.స.)
విశాఖపట్నం జూ పార్కు వద్ద పోలీస్ ఎస్కార్ట్ వాహనం ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో సుమారు 10 మంది కానిస్టేబుళ్లు గాయపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు, పోలీసులు వెంటనే బాధితులను ఆస్పత్రికి తరలించారు. ఇవాళ (గురువారం) ఉదయం 30 మంది సిబ్బందితో ఎస్కార్ట్ బస్సు వెళ్తోంది. అయితే, జూ పార్కు సమీపానికి రాగానే డ్రైవర్ ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయాడు. ఓ కారును తప్పించబోయి రోడ్డు డివైడర్ను ఢీకొట్టాడు.
అనంతరం రోడ్డుకు అవతలి వైపునకు బస్సు వేగంగా దూసుకెళ్లింది. దీంతో మధురవాడ నుంచి విశాఖపట్నం వైపు వెళ్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు ముందు భాగం తీవ్రంగా దెబ్బతినగా.. ఐదుగురు కానిస్టేబుళ్లకు తీవ్ర గాయాలు అయ్యాయి. మరో ఐదుగురికి స్వల్ప గాయాలయ్యాయి. బాధితులను హుటాహుటిన ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా, కానిస్టేబుళ్లు గుడిలోవావిజ్ఞాన్ విహార్ స్కూల్ ఎస్కార్ట్ పార్టీని రిలీవ్ చేసేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అందరికీ ప్రాణాపాయం తప్పడంతో బాధిత కుటుంబాలు ఊపిరి పీల్చుకున్నాయి. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
మరోవైపు, ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించారు. విశాఖ పోలీస్ కమిషనర్కు ఫోన్ చేసి గాయపడిన కానిస్టేబుళ్ల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. బాధితుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఉన్నతాధికారులకు సూచించారు. కానిస్టేబుళ్లు త్వరగా కోలుకోవాలని హోంమంత్రి అనిత ఆకాంక్షించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ