ప్రైవేట్కు దీటుగా సర్కారు బడులు.. : అశ్వరావుపేట ఎమ్మెల్యే
ప్రైవేట్కు దీటుగా సర్కారు బడులు.. : అశ్వరావుపేట ఎమ్మెల్యే
MLA


భద్రాద్రి కొత్తగూడెం, 20 ఆగస్టు (హి.స.)

ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్,

కార్పొరేట్ బడులకు దీటుగా అత్యుత్తమ ప్రమాణాలతో వర్ధిల్లాలన్నది ప్రభుత్వ ప్రధాన సంకల్పమని, ఆ సంకల్పాన్ని అశ్వారావుపేట ఏజెన్సీ నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలో అక్షరాలా నెరవేరుస్తున్నట్లు స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ తెలిపారు. ఒకప్పటి ప్రభుత్వ వ్యాయామ ఉపాధ్యాయుడిగా (పీఈటీ) పనిచేసిన ఆయన, బడి పిల్లల కష్టనష్టాలను దగ్గరగా చూసిన వ్యక్తి కావడంతో.. ఇప్పుడు ఎమ్మెల్యే హోదాలో తన సొంత చొరవతో మన బడి- మన ఎమ్మెల్యే పేరిట వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలో దిశ ముఖాముఖిలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ఈ కార్యక్రమం ద్వారా విద్యాభివృద్ధికి సంబంధించిన తన ప్రణాళికలు, లక్ష్యాలను పంచుకున్నారు. నియోజకవర్గంలోని ప్రతి ప్రాథమిక, ప్రాథమికోన్నత, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలతో పాటు ఆశ్రమ, గురుకుల పాఠశాల లన్నింటినీ విధిగా సందర్శించాలనేది తన ప్రణాళిక అని ఆయన అన్నారు.

ఇప్పటికే నియోజకవర్గ వ్యాప్తంగా అనేక పాఠశాలలను తాను సందర్శించినట్లు ఆయన తెలిపారు. తన పర్యటనలన్నీ ముందస్తు సమాచారం లేకుండా సడన్ విజిట్స్ గానే ఉంటాయని అన్నారు. బడికి వెళ్లి ఏదో పైపైన పరిశీలించి రాకుండా, ఆ రోజంతా అక్కడే విద్యార్థులతోనే గడుపుతాను. నేరుగా తరగతి గదుల్లో కూర్చుని, విద్యార్థులతో మమేకమై స్వయంగా పుస్తకాలు చదివించడం, బోర్డుపై రాయించడం ద్వారా వారి అభ్యసన సామర్థ్యాలను నేరుగా అంచనా వేస్తున్నాను. ఉపాధ్యాయులతో ముఖాముఖిగా మాట్లాడి, విద్యాబోధనలో వాస్తవ పరిస్థితులను తెలుసుకుంటున్నాను అని ఎమ్మెల్యే వివరించారు. అశ్వారావుపేట ఏజెన్సీ నియోజకవర్గం కావడంతో మారుమూల అటవీ ప్రాంతాలు, గిరిజన గూడేలు, తండాల విద్యార్థులు ఏ ఒక్కరూ చదువుకు దూరం కాకూడదన్నదే తన ప్రాథమిక లక్ష్యమని ఆయన అన్నారు. కనీస సౌకర్యాల లేమితో గిరిజన విద్యార్థులు మధ్యలోనే బడి మానేయకుండా ఉండేలా ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. నూరు శాతం హాజరు సాధించే దిశగా విద్యాశాఖ అధికారులను నిరంతరం అప్రమత్తం చేస్తూ పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన అన్నారు.పాఠశాలల సందర్శనకు వెళ్లినప్పుడు అక్కడ విద్యార్థులు, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న ప్రతి ఇబ్బందినీ స్వయంగా తన నోట్ చేసుకుంటున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.

ప్రధానంగా తాగునీటి సమస్య, మరుగుదొడ్ల కొరత, పాతబడిన భవనాల స్థానంలో నూతన భవనాల నిర్మాణం వంటి మౌలిక వసతుల సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి తక్షణమే నిధులు మంజూరు చేయిస్తున్నామని అన్నారు. ప్రతి బడి ఆస్తులను కాపాడటంతో పాటు, విద్యార్థులకు భద్రత కల్పించేందుకు రక్షణ గోడలు నిర్మిస్తున్నామని ఆయన తెలిపారు. పాఠశాల ఆవరణ పరిసరాలు పరిశుభ్రంగా, ఆహ్లాదకరంగా ఉంచడంతో పాటు, విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందేలా చూడటం, డిజిటల్ తరగతుల ఏర్పాటు తన లక్ష్యాల్లో ముఖ్యమైనవని స్పష్టం చేశారు. విద్యార్థుల్లో భవిష్యత్తుపై స్పష్టమైన అవగాహన కల్పించేందుకు ఈ యాత్రలో తనతో పాటు మండల స్థాయి అధికారులను కూడా బడులకు తీసుకెళ్తున్నట్లు ఆయన తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande