
ఆసిఫాబాద్, 20 ఆగస్టు (హి.స.) ఆసిఫాబాద్ జిల్లా గాంధీనగర్లో కాగజ్నగర్ పోలీసులు
గురువారం వేకువజామున మెరుపు తనిఖీలు నిర్వహించారు. మాదకద్రవ్యాలు లేని సమాజ స్థాపనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కాగజ్నగర్ టౌన్ సీఐ ప్రేమ్కుమార్ యువతకు పిలుపునిచ్చారు. కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ పట్టణంలోని గాంధీనగర్ కాలనీలో ఉదయం 6 గంటలకే పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. సమాజంలో అనుమానాస్పద వ్యక్తుల సంచారాన్ని, అక్రమ కార్యకలాపాలను పూర్తిగా అరికట్టడమే లక్ష్యంగా ఈ సోదాలు చేపట్టినట్లు సీఐ తెలిపారు. ఈ సందర్భంగా సరైన పత్రాలు, నెంబర్ ప్లేట్లు లేని 32 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
సోదాల అనంతరం కాలనీవాసులతో నిర్వహించిన అవగాహన సదస్సులో సీఐ ప్రేమ్కుమార్ మాట్లాడారు. సమాజ నిర్మాణంలో యువత పాత్ర కీలకమని, మట్కా, గంజాయి వంటి వ్యసనాలకు బానిసలై జీవితాలను నాశనం చేసుకోవద్దని హితవు పలికారు. గంజాయిని సాగు చేసిన, కొనుగోలు చేసిన, రవాణా చేసినా చట్టప్రకారం కఠినమైన జైలు శిక్షలు తప్పవని స్పష్టం చేశారు. ఎవరైనా గంజాయి విక్రయిస్తున్నట్లు తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. సమాచారం అందించిన వారి వివరాలను నూటికి నూరు శాతం గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..