
అమరావతి, 20 ఆగస్టు (హి.స.)
అనకాపల్లి జిల్లాలో చేపట్టనున్న BARC ప్రాజెక్టుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఊరట కల్పించింది. ప్రాజెక్టు కోసం భూముల రిజిస్ట్రేషన్కు సంబంధించిన స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజులను మినహాయిస్తూ నిర్ణయం తీసుకుంది. అనకాపల్లిలో 4,950 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్కు ఫీజులను మినహాయిస్తూ సర్కార్ జీవో జారీ చేసింది. తొలి దశలో అచ్చుతాపురం, మునగపాక మండలాల్లోని 1,947.225 ఎకరాల భూములకు స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజుల మినహాయింపు వర్తించనుంది. అనంతరం మిగిలిన భూములకు కూడా దశలవారీగా ఈ రాయితీని రెవెన్యూ శాఖ వర్తింపజేయనుంది.
అచ్చుతాపురం ప్రాంతంలో క్లీన్ ఎనర్జీ, అణు పరిశోధన, రేడియేషన్ సాంకేతికతపై పరిశోధనలు నిర్వహించే కేంద్రాన్ని BARC ఏర్పాటు చేయనుంది. దేశ రక్షణ, ఇంధనం, వైద్యం, వ్యవసాయం తదితర రంగాల్లో పరిశోధనల కోసం బీఏఆర్సీ ప్రాజెక్ట్ కీలకంగా మారనుంది. భూముల రిజిస్ట్రేషన్కు సంబంధించిన ఫీజుల మినహాయింపుపై భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 285(1) నిబంధనల ప్రకారం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ