సైబర్ క్రైమ్ నియంత్రణలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు రాష్ట్రస్థాయి గుర్తింపు.. ఎస్పీ రోహిత్ రాజ్
సైబర్ క్రైమ్ నియంత్రణలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు రాష్ట్రస్థాయి గుర్తింపు.. ఎస్పీ రోహిత్ రాజ్
Sp


కొత్తగూడెం, 20 ఆగస్టు (హి.స.)

సైబర్ నేరాల నియంత్రణలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు రాష్ట్రస్థాయిలో గుర్తింపు సాధించారు. కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలోని ఎంఆర్ఎం, జీఆర్ఎం, సమన్వయ, సహాయోగ్ తదితర పోర్టల్స్ వినియోగంలో జిల్లా సమన్వయ కేటగిరీలో మొదటి స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ ఉత్తమ ప్రతిభ కనబరిచిన సైబర్ క్రైమ్ అధికారులు, సిబ్బందిని అభినందించారు. సైబర్ మోసాల బారినపడిన బాధితులకు వేగంగా సేవలు అందించడంతో పాటు, సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత సమర్థవంతంగా వినియోగించాలని సూచించారు.

యువతను సైబర్ నేరాలపై అప్రమత్తం చేసేందుకు జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో స్పార్క్ క్లబ్ ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రియదర్శిని డిగ్రీ కళాశాల, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులకు సైబర్ నేరాలపై శిక్షణ ఇచ్చారు. ఫేక్ లింకులు, ఓటీపీ మోసాలు, సోషల్ మీడియా మోసాలు, ఆన్లైన్ మోసాలు, డిజిటల్ అరెస్టుల పేరుతో జరుగుతున్న మోసాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యార్థులు సైబర్ భద్రతపై అవగాహన పెంచుకుని తమ కుటుంబ సభ్యులు, స్నేహితులను కూడా అప్రమత్తం చేయాలని ఎస్పీ సూచించారు. సైబర్ నేరాల నియంత్రణలో పోలీసుల చర్యలతో పాటు ప్రజల్లో, ముఖ్యంగా యువతలో అవగాహన అత్యంత కీలకమని ఆయన పేర్కొన్నారు. ఎంహెచ్పీ పోర్టల్స్ వినియోగంలో జిల్లాకు లభించిన రాష్ట్రస్థాయి గుర్తింపు పోలీసు అధికారులు, సైబర్ క్రైమ్ సిబ్బంది సమిష్టి కృషికి నిదర్శనమని ఎస్పీ అన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande