యూరియా కోసం జాతీయ రహదారిపై రైతుల ధర్నా...
యూరియా కోసం జాతీయ రహదారిపై రైతుల ధర్నా...
Farmers


మెదక్, 20 ఆగస్టు (హి.స.)

పంటలకు సరిపడా యూరియా అందక, దుకాణాల చుట్టూ తిరగాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తూ మెదక్ జిల్లాలోని మనోహరాబాద్ మండల కేంద్రంలో రైతులు జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. యాప్ పేరుతో ఎరువులు అందకుండా చేయడంపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోకపోతే పురుగుల మందు తాగి ప్రాణాలు తీసుకుంటామని హెచ్చరిస్తూ పురుగుల మందు డబ్బాతో నిరసన తెలిపారు.

తక్షణమే యూరియాను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ నిరసన కారణంగా జాతీయ రహదారిపై వాహనాలు భారీగా నిలిచిపోయి ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇప్పటివరకు మండల పరిధిలో అందుబాటులో ఉన్న యూరియా వివరాలను చూపించే యాప్ ఉండగా, ప్రస్తుతం కొత్తగా తీసుకొచ్చిన యాప్లో జిల్లా వ్యాప్తంగా యూరియా లభ్యతను చూపిస్తున్నారని రైతులు తెలిపారు. దీంతో కొత్త యాప్ కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ప్రభుత్వం, అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించి, గతంలో ఉన్న విధానాన్నే యథావిధిగా కొనసాగించాలని రైతులు డిమాండ్ చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande