
భూపాలపల్లి, 20 ఆగస్టు (హి.స.)
రాబోయే 30 రోజుల్లో ఓటరు జాబితా సవరణ ప్రక్రియను నాణ్యతతో ప్రత్యేక దృష్టి సారించి పూర్తి చేయాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. గురువారం ఐడీఓసీ కార్యాలయంలో సర్ ప్రక్రియలో భాగంగా అనామలిస్, మ్యాపింగ్ కానీ ఓటర్లకు నోటీసులు జారీ తదితర అంశాలపై తహసీల్దార్లు, ఎంపిడిఓలు, బూత్ సూపర్ వైజర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అనామలిస్, మ్యాపింగ్ కానీ ఓటర్లకు గ్రామ పంచాయతీల వారీగా విడతలవారీగా నోటీసులు జారీ చేయాలని సూచించారు. నోటీసు అందజేసిన అనంతరం నిబంధనల ప్రకారం ఏడు రోజుల వ్యవధి ఇచ్చి విచారణ చేపట్టి ప్రతి కేసును క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని తెలిపారు.
నోటీసు తీసుకున్న వ్యక్తుల ఫొటో అప్లోడ్ చేయాలని సూచించారు. ఎంపీడీఓలు, ఏఈఆర్లు, తహసీల్దార్లు, వీఆర్లు, బీఎల్ఎలు పరస్పర సమన్వయంతో మండలాల వారీగా పక్కా కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని ఆదేశించారు. రాబోయే 30 రోజుల్లో ఓటర్ల జాబితా సవరణకు సంబంధించిన ప్రక్రియను నాణ్యతతో పూర్తి చేసేలా ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఇతర జిల్లాలతో పోలిస్తే జిల్లాలో నో మ్యాపింగ్, వ్యత్యాసాలకు సంబంధించిన ఓటర్లు సంఖ్య తక్కువగా ఉందని, సమయాన్ని సద్వినియోగం చేసుకొని అంశాన్ని సమగ్రంగా పరిశీలించి పరిష్కరించాలని సూచించారు. నోటీసుల జారీ, విచారణ, పరిష్కార ప్రక్రియను ఈఆర్ స్థాయిలో వేగవంతం చేయాలని తెలిపారు.రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం నుంచి నోటీసులు జారీ, పరిష్కరించిన కేసులపై ప్రతిరోజూ పర్యవేక్షణ ఉంటుందని కలెక్టర్ పేర్కొన్నారు. అందువల్ల రోజువారీ కార్యాచరణ ప్రణాళికతో, పెండింగ్ లేకుండా ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. ఓటర్ల జాబితా సవరణలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా, అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు పరిరక్షించేలా అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. అంతకు ముందు ఎన్నికల విభాగం సిబ్బంది నవీన్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..