ఆ రహస్యమేంటో చెప్పు హరీశ్ రావు.. మంత్రి పొంగులేటి కౌంటర్!
ఆ రహస్యమేంటో చెప్పు హరీశ్ రావు.. మంత్రి పొంగులేటి కౌంటర్!
Minister


హైదరాబాద్, 20 ఆగస్టు (హి.స.)

తెలంగాణ రాజకీయం అంతా 22-ఏ నిషేధిత భూముల చుట్టూ నడుస్తోంది. ఈ వివాదానికి బాధ్యతగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని భర్తరఫ్ చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు ఇవాళ మాజీ మంత్రి హరీశ్ రావు ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీకి బహిరంగ లేఖను సైతం రాశారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్తో పాటు హరీశ్ రావుకు మంత్రి పొంగులేటి కౌంటర్ ఇచ్చారు. ప్రతిపక్ష పార్టీగా కూడా బీఆర్ఎస్ ఫెయిల్ అయిందని దుయ్యబట్టారు. ప్రతిపక్ష హోదాలో ఉండి అబద్దాలను పదే పదే చెబుతూ ప్రజల్లో ఆందోళనను రేకెత్తించడం తప్ప మీ వల్ల ప్రజలకు ఏలాంటి ఉపయోగం లేదని మండిపడ్డారు. ఈ మేరకు ఇవాళ ఎక్స్ వేదికగా ఆయన ఓ పోస్టు చేశారు.

కమిషన్ల గురించి, అవినీతి గురించి హరీశ్ రావు మాట్లాడుతుంటే హంతకుడే సంతాపం తెలిపినట్లు ఉందని పొంగులేటి విమర్శించారు. పదేండ్లలో మీరు ఎలాంటి అవినీతికి పాల్పడ్డారో, స్వయంగా మీ పార్టీ అధ్యక్షులు, మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత అనేక సందర్భాల్లో వివరించిన విషయం మర్చిపోతే ఎలా హరీష్ రావు? అని నిలదీశారు. అవినీతి గురించి హరీష్ రావు నీతి వాక్యాలు చెబుతుంటే బీఆర్ఎస్ నేతలు కూడా నవ్వుకుంటున్నారన్నారు. రబ్బరు చెప్పులతో తిరిగిన అగ్గిపెట్టె రావు... పదేండ్లలో విచ్చలవిడిగా దోచుకునే కదా తరతరాలకు తిన్నా తరగని డబ్బు సంపాదించుకున్నారని ఆరోపించారు. మీ ఆర్థిక పరిపుష్టికి అవినీతే కదా ఆధారం... అధికారంలో ఉన్నప్పుడు ఏం కష్టపడ్డారో, ఎలాంటి వ్యాపారం చేశారో, అంత తక్కువ సమయంలో ఎవరికీ సాధ్యం కానంత డబ్బు ఎలా సంపాదించారో, ఆ రహస్యం ఏంటో ప్రజలకు వివరిస్తే బాగుంటుంది అగ్గిపెట్టె రావు అని సెటైర్లు వేశారు. కాళేశ్వరం, ధరణి నుండి మెడికల్ కాలేజీల వరకు అన్నింటిలోనూ దోచుకున్న బీఆర్ఎస్ నేతలు.. కమిషన్ల ప్రభుత్వమని మాట్లాడటం సిగ్గుచేటన్నారు. వారి పాలనలో కమీషన్ల మీద పనులు జరిగినట్టు ఈ ప్రభుత్వంలో కూడ జరుగుతుందనుకోవడం మీ భ్రమ అని మీ భ్రమను ప్రజలమీద రుద్దకండి అంటూ హితవు పలికారు. ఆనాడు అధికారంలో ఉండి పరిపాలనలో పూర్తిగా విఫలమయ్యారు. నేడు ప్రతిపక్షంలో ఉండి కూడా నిర్మాణాత్మకంగా వ్యవహరించకుండా, ప్రజల కోణంలో ఆలోచించకుండా... ప్రతిపక్ష పార్టీగా కూడా బీఆర్ఎస్ పార్టీ పనికిరాదని నిరూపిస్తున్నారన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande