ఉచిత పథకాలతో రాష్ట్రంలో ఆర్థిక ప్రమాద ఘంటికలు : హైకోర్టు ఆగ్రహం
ఉచిత పథకాలతో రాష్ట్రంలో ఆర్థిక ప్రమాద ఘంటికలు : హైకోర్టు ఆగ్రహం
High court


హైదరాబాద్, 20 ఆగస్టు (హి.స.) రాష్ట్రంలో అమలు చేస్తున్న కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ వంటి ఉచిత పథకాల చట్టబద్ధతపై దాఖలైన పిటిషన్పై తెలంగాణ హైకోర్టు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ పథకాలకు సంబంధించి విధించిన స్టేను తొలగించేందుకు ధర్మాసనం నిరాకరించింది. విచారణ సందర్భంగా ప్రభుత్వం సమర్పించిన అఫిడవిట్ను పరిశీలించిన కోర్టు, అందులో సరైన వివరాలు లేవని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.

ఇలాంటి ఉచిత పథకాల వల్ల రాష్ట్రంలో ఆర్థిక ప్రమాద ఘంటికలు మోగుతున్నాయని హైకోర్టు స్పష్టం చేసింది. ఉచిత పథకాలకు పరిమితి లేకుండా నిధులు మళ్లించడం వల్ల ఇతర అత్యవసర రంగాలపై తీవ్ర ప్రభావం పడుతోందని అభిప్రాయపడింది. ముఖ్యంగా ఉద్యోగులు పదవీ విరమణ పొందినప్పటికీ.. వారికి అందాల్సిన ఫించన్లు, బెనిఫిట్స్ సమయానికి చెల్లించలేకపోతున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. ఫలితంగా బెనిఫిట్స్ అందక నిరాశకు గురైన చాలామంది ఉద్యోగులు న్యాయం కోసం కోర్టు తలుపు తడుతున్నారని గుర్తుచేసింది.

నిర్బంధ భూసేకరణ బాధితులకు చెల్లించాల్సిన పరిహారాలను పక్కనపెట్టి ఉచిత పథకాలకు నిధులు ఎలా కేటాయిస్తారని కోర్టు ప్రశ్నించింది. ప్రజాధనాన్ని ఇలా మళ్లించే బదులు, భూబాధితులకు సకాలంలో పరిహారం చెల్లించి, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే అసలు ప్రజలకు ఇటువంటి పథకాల అవసరమే ఉండదని వ్యాఖ్యానించింది. ప్రభుత్వ రంగాలు లాభాలు గడిస్తే ఆ నిధులతో సంక్షేమం చేయవచ్చు కానీ.. ఆర్థిక స్థితిని మించి ఉచితాలు పంచడం సరైంది కాదని స్పష్టం చేస్తూ, సమగ్ర వివరాలతో కూడిన కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande