ఫారం పాండ్ల నిర్మాణంతో భూగర్భజలాలను పెంపొందించాలి : కలెక్టర్ ఆదర్శ్ సురభి
ఫారం పాండ్ల నిర్మాణంతో భూగర్భజలాలను పెంపొందించాలి : కలెక్టర్ ఆదర్శ్ సురభి
Collector


వనపర్తి, 20 ఆగస్టు (హి.స.)

వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాలను పెంపొందించడంతో పాటు వ్యవసాయ అవసరాలకు నీటిని అందుబాటులో ఉంచేందుకు ఫారం పాండ్లు ఉపయోగపడతాయని, జిల్లాలో వాటి నిర్మాణాన్ని విస్తృతంగా చేపట్టాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. గురువారం వనపర్తి జిల్లా పానగల్ మండల పరిధిలోని గోప్లాపూర్ గ్రామంలో వీబీజీ రామ్ (గ్రామీణ ఉపాధి పథకం) కింద చేపడుతున్న ఫారం పాండ్ నిర్మాణ పనులను అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ఖిమ్యా నాయక్తో కలిసి పరిశీలించారు. ఫారం పాండ్ నిర్మాణం చేయించుకుంటున్న రైతు పల్లవితో కలెక్టర్ మాట్లాడి పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. తనకున్న రెండు ఎకరాల భూమిలో రెండు గుంటల విస్తీర్ణంలో ఫారం పాండ్ నిర్మిస్తున్నట్లు రైతు తెలిపారు. ఫారం పాండ్ ద్వారా వర్షపు నీటిని నిల్వ చేసుకోవడంతో పాటు భూగర్భ జలాల పెంపు, బోర్ల రీచార్జ్లు, వ్యవసాయ అవసరాలకు నీటిని వినియోగించుకునే అవకాశం ఉంటుందని రైతు పల్లవి వివరించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఫారం పాండ్ నిర్మాణంపై ఆసక్తి ఉన్న రైతులను గుర్తించి మరిన్ని పాండ్ల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మహిళా సంఘాల సభ్యులతో సమావేశాలు నిర్వహించి ఫారం పాండ్ల నిర్మాణం వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించాలని సూచించారు. జిల్లాకు నిర్దేశించిన ఫారం పాండ్ల నిర్మాణ లక్ష్యాన్ని నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ను ఆదేశించారు. ప్రస్తుత పరిస్థితుల్లో నీటి లభ్యత తక్కువగా ఉన్నందున రైతులు వరి సాగుకు దూరంగా ఉండి వేరుశెనగ, పెసర, కంది వంటి ఆరుతడి పంటలను సాగు చేయాలని కలెక్టర్ సూచించారు. తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయడం ద్వారా నీటి కొరతతో ఎదురయ్యే ఇబ్బందులను అధిగమించడంతో పాటు రైతుల ఆదాయాన్ని కాపాడుకోవచ్చని తెలిపారు.

అనంతరం గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలను సందర్శించి, పాఠశాలలోని వంటగదిని పరిశీలించి విద్యార్థులకు భోజనం గ్యాస్ స్టవ్పై వండుతున్నారా లేదా అని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు అందిస్తున్న ఆహార నాణ్యత, వంటగది పరిశుభ్రతను పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహారం అందేలా చర్యలు తీసుకోవాలని, వంటగది పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని అధికారులను, సిబ్బందిని కలెక్టర్ ఆదేశించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande