
హైదరాబాద్, 26 ఆగస్టు (హి.స.)
కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ భూములున్నా వెంటనే అమ్మేస్తోందని గడిచిన రెండున్నరేళ్లలో రూ. 30 వేల కోట్ల విలువైన భూములు విక్రయించారని మాజీమంత్రి హరీశ్ రావు విమర్శించారు. ప్రజల నుంచి భూములు సేకరించి తన అనుచరులకు కట్టబెడుతున్నారని ఇప్పుడు ప్రజల భూములను కూడా 22ఏ లో చేర్చి ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. ఇవాళ హైదరాబాద్ కూకట్ పల్లిలో 22ఏ నిషేధిత భూముల బాధితులతో ఏర్పాటు చేసిన సమావేశంలో హరీశ్ రావు మాట్లాడారు. ULC (అర్బన్ ల్యాండ్ సీలింగ్) చట్టం పేరిట రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భారీ కుట్రకు తెర లేపుతున్నారని ఇది సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధం అన్నారు. 2008లో వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉనప్పుడు యూఎల్సీ చట్టం రద్దు చేసిందని తర్వాత ప్రభుత్వం అన్ని అనుమతులు ఇస్తే ప్రజలు ప్లాట్లు కొనుక్కుని ఇండ్లు కట్టుకున్నారన్నారు. కానీ రేవంత్ రెడ్డి 2008 కంటే ముందు మీ భూమి యూఎల్సీలో ఉందని నిషేధిత జాబితాలో పెట్టారని ఆరోపించారు. గతంలో దీపావళి సందర్భంగా ప్రతిపక్షాలపై బాంబులు వేస్తానన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రతిపక్షాలకు బదులు ప్రజలపై 22ఏ బాంబు వేశారని.. పొంగులేటి నీ బాంబులు ఇవేనా? అని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి, పొంగులేటికి రియల్ ఎస్టేట్ తెలిసి ఉండొచ్చు.. కానీ బీఆర్ఎస్ నాయకులకు ఉద్యమాలు, పోరాటాలు తెలుసన్నారు. అవసరమైతే ప్రభుత్వం మెడలు వంచి ప్రజల పక్షాన నిలబడటం కూడా తెలుసన్నారు. రేవంత్ రెడ్డి మొదట HCUలోని 400 ఎకరాల భూముల్ని అమ్మకానికి పెట్టారని అది కుదరకపోవడం వల్ల బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో కుదువ పెట్టి రూ. 10 వేల కోట్లు అప్పు తెచ్చారని ఆరోపించారు. అలాగే మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లోని 9 వేల ఎకరాల భూముల్ని అదే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో కుదువ పెట్టి రూ.10 వేల కోట్లు అప్పు తెచ్చారని ఇలా రేవంత్ రెడ్డి ప్రజల భూములతో పాటు ప్రభుత్వ, కాలేజీ, యూనివర్సిటీ భూములను వదిలిపెట్టడం లేదన్నారు. సామాన్యుల భూములను 22Aలో పెట్టి వేధిస్తూ సీఎం బంధువులకు మాత్రం విలువైన ప్రభుత్వ ఆస్తులు దారాదత్తం చేస్తున్నారని ఆరోపించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..