
రాజన్న సిరిసిల్ల, 26 ఆగస్టు (హి.స.)
శాంతి, సౌభ్రాతృత్వంతో పండుగలను నిర్వహించుకోవాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే సూచించారు. బుధవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన మిలాద్ ఉన్ నబీ వేడుకల్లో పాల్గొన్న ఆయన ముస్లిం సోదరులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కీర్ పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా మిలాద్ ఉన్ నబీ సందర్భంగా ముస్లిం సోదరులు నిర్వహించిన ర్యాలీలు ప్రశాంత వాతావరణంలో జరిగాయని తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తోందన్నారు. హిందూ, ముస్లిం సోదరులు భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటుతూ అన్ని పండుగలను పరస్పర సహకారం, సోదరభావంతో నిర్వహించుకోవడం అభినందనీయమన్నారు.
మిలాద్ ఉన్ నబీ వేడుకల సందర్భంగా జిల్లా వ్యాప్తంగా పోలీసు శాఖ ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తెలిపారు. ర్యాలీలు సజావుగా జరిగేలా భద్రతా ఏర్పాట్లు చేపట్టడంతో పాటు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు నిరంతరం పర్యవేక్షణ చేపట్టారని వెల్లడించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..