
హైదరాబాద్, 26 ఆగస్టు (హి.స.)
తెలంగాణలో సెక్షన్ 22-A భూముల సంక్షోభంపై తక్షణమే జోక్యం చేసుకుని, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి కేబినెట్ నుండి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐసీసీ అగ్రనేత, లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీకి తెలంగాణ బేజేఎల్పీ నాయకుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవస్థీకృత భూ దోపిడీకి పాల్పడుతోందని అందువల్ల ధరణి డిజిటలైజేషన్ ఆడిట్ నివేదికను బహిరంగంగా విడుదల చేయడంతో పాటు, 2014 నుండి నేటి వరకు సెక్షన్ 22-A కింద సర్వే నంబర్ల వారీగా చేసిన అన్ని చేర్పులు, తొలగింపులు, మార్పులను వివరిస్తూ ఒక అధికారిక శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆర్థిక లావాదేవీలు మరియు క్విడ్ ప్రో కో వ్యవహారాలపై సిట్టింగ్ హైకోర్టు న్యాయమూర్తితో జ్యుడీషియల్ విచారణ జరిపించాలని, చట్టబద్ధమైన ప్రైవేట్ పట్టా భూములన్నింటినీ నిషేధిత జాబితా నుంచి తొలగించడానికి షరతులు లేని, కాలవ్యవధితో కూడిన ఒక నిర్దిష్ట అధికార యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
మీరు దేశవ్యాప్తంగా రాజ్యాంగాన్ని చేత పట్టుకుని రాజ్యాంగ పరిరక్షకులుగా ప్రచారం చేసుకుంటూ తిరుగుతుంటే మీ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోని వాస్తవ పరిస్థితులు మాత్రం మీ ద్వంద్వ వైఖరిని ప్రజల కళ్లకు కట్టినట్లు బట్టబయలు చేస్తున్నాయన్నారు. తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ యంత్రాంగాన్ని రాజకీయ నిధుల సమీకరణకు వేదికగా మార్చేశారని ధ్వజమెత్తారు.
1908 రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ 22-Aను ఒక ఆయుధంగా ఉపయోగించి తెలంగాణలో కాంగ్రెస్
ప్రభుత్వం నిజమైన పట్టాదారులైన, చిన్న, సన్నకారు రైతులు వారితో పాటు మధ్యతరగతి కుటుంబాల హక్కులను కాలరాస్తోందన్నారు. చట్టబద్ధమైన భూ యజమానుల భూములు అకస్మాత్తుగా రాత్రికి రాత్రే నిషేధిత జాబితాలో చేర్చబడ్డాయని ఆరోపించారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం తన హయాంలో ధరణి పోర్టల్, TLRUPలను ఒక ఆయుధంగా ఉపయోగించుకుని ప్రజలను వేధింస్తే ఈ దోపిడీ యంత్రాంగాన్ని నిర్మూలించడానికి బదులుగా రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం అదే దోపిడీ విధానాన్ని మరింత విస్తరించిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా భూ భారతి నిర్వహించిన ఇన్వెంటరీ ఆడిట్ ఫలితంగా, రాష్ట్రవ్యాప్త భూభారతి ఇన్వెంటరీ ఆడిట్ పేరుతో వ్యవసాయ, అస్సైన్డ్, కన్వర్టెడ్ భూములతో కలిపి నిషేధిత ప్రైవేట్ భూముల విస్తీర్ణం కొన్ని లక్షల ఎకరాలకు చేరిందని దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం నిషేధిత భూముల విస్తీర్ణం అక్షరాలా 1.00 నుండి 1.05 కోట్ల ఎకరాలకు చేరుకుందన్నారు. ఈ సంక్షోభం పరిపాలనాపరమైన పొరపాటు కాదని పూర్తిగా పథకం ప్రకారం సాగుతున్న వ్యాపార దందా అని ఆరోపించారు. ఈ కుట్రను కేబినెట్ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్వయంగా బయటపెట్టారన్నారు. రెవెన్యూ మంత్రి కుటుంబానికి సంబంధించిన కార్పొరేట్ సంస్థలైన రాఘవ కన్స్ట్రక్షన్స్ తో ముడిపడి ఉన్న వేల కోట్ల రూపాయల భారీ ఆర్థిక లావాదేవీలకు సంబంధించి బలమైన ఆధారాలున్నాయని. ఉద్దేశపూర్వకంగా సెక్షన్ 22-A కింద భూములను కావలసి నిషేధిత భూముల జాబితాలో చేర్చడం, తర్వాత డి-నోటిఫికేషన్ల ద్వారా నెలకు వేల కోట్ల రూపాయలను సృష్టించే వ్యవస్థాగత వసూళ్ల దందా నడుస్తోందని, అందులోంచి నెలకు రూ.200 కోట్ల వరకు కాంగ్రెస్ అధిష్టానానికి నిధులుగా చేరుతున్నాయని తీవ్రమైన ఆరోపణలు బహిరంగంగా వినిపిస్తున్నాయన్నారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..