హిజాబ్ పై నిర్ణయించడానికి జడ్జీలు ఎవరు?.. హైకోర్టు తీర్పుపై ఒవైసీ ఆగ్రహం
హిజాబ్ పై నిర్ణయించడానికి జడ్జీలు ఎవరు?.. హైకోర్టు తీర్పుపై ఒవైసీ ఆగ్రహం
Owaisi


హైదరాబాద్, 26 ఆగస్టు (హి.స.)

పాఠశాలలో హిజాబ్ ధరించేందుకు అనుమతి నిరాకరిస్తూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును ఎంఐఎం పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర స్థాయిలో ఖండించారు. ఈ తీర్పును ఇస్లాంపై దాడిగా అభివర్ణించారు. ఇది మా మతం, ఏది అవసరమో మేమే నిర్ణయించుకుంటాం. నిర్ణయించడానికి న్యాయమూర్తులు ఎవరు? అని ప్రశ్నించారు. ఇస్లాంకు ఏది ముఖ్యమో, ఏది ముఖ్యం కాదో నిర్ణయించడం న్యాయమూర్తుల పని కాదన్నారు. స్కూల్ యూనిఫామ్కు అదనంగా హిజాబ్ ధరించేందుకు తనకు అనుమతి ఇచ్చేలా విద్యాసంస్థను ఆదేశించాలని కోరుతూ ప్రయాగ్ రాజ్లోని ఒక ప్రైవేట్ స్కూల్ లో చదువుతున్న ఓ విద్యార్థిని దాఖలు చేసిన పిటిషన్ను ఈ నెల 21న జస్టిస్ జేజే మునీర్, జస్టిస్ ఇంద్రజీత్ శుక్లాతో కూడిన ధర్మాసనం కొట్టివేసింది. అలాగే ఇస్లాంలో మహిళలు హిజాబ్ ధరించడం తప్పనిసరైన మత ఆచారం కాదని హైకోర్టు స్పష్టం చేసింది.

హైదరాబాద్లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఒవైసీ.. అలహబాద్ హైకోర్టు తీర్పుపై స్పందించారు. ఈ తీర్పు రాజ్యాంగంలోని ఆర్టికల్ 19, ఆర్టికల్ 25 కు వ్యతిరేకమని ఆరోపించారు. శబరిమల కేసుకు సంబంధించి అత్యవసర మతాచారాలపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న వేళ అలహాబాద్ హైకోర్టు ఈ తీర్పు ఇవ్వడం సరికాదన్నారు. ఈ తీర్పు వల్ల ఉత్తరప్రదేశ్లో ముస్లిం బాలికల విద్య దెబ్బతింటుందని వారిని చదువుకు దూరం చేసే కుట్ర అని ఒవైసీ ఆందోళన వ్యక్తం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande