
ములుగు, 26 ఆగస్టు (హి.స.)
ప్రజా సంక్షేమమే ప్రజా ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ (సీతక్క) అన్నారు. బుధవారం ములుగు జిల్లా మంగపేట మండల కేంద్రంలోని గంపోనిగూడెం రైతు వేదికలో ఎంపీడీవో బి. బద్రు నాయక్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమానికి మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 43 మంది అర్హులైన లబ్ధిదారులకు చేయూత పింఛన్కు సంబంధించిన మంజూరు పత్రాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని ప్రజా ప్రభుత్వం పేదల పక్షపాతి ప్రభుత్వమని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని తెలిపారు. రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను చేపడతామని చెప్పారు. చేయూత పింఛన్ పథకానికి, రేషన్ కార్డుకు అర్హత ఉండి ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని వారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని మంత్రి సూచించారు.
అనంతరం వారు మల్లంపల్లి మండలంలో పర్యటించారు..
అన్ని కులాల వారు వారి పురాతన కాలమైన సాంప్రదాయాలను కాపాడుకోవాలని, రానున్న తరం వారికి వాటిపై అవగాహన కల్పించాలని సీతక్క అన్నారు. ములుగు జిల్లా మల్లంపల్లి మండలం రామచంద్రపూర్ గ్రామంలో బంజారా కులస్తులు కన్నుల పండుగ నిర్వహిస్తున్న తీజ్ పండుగ వేడుకలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. బంజారా సంస్కృతి, సంప్రదాయాలకు తీజ్ పండుగ ప్రత్యేకమైన గుర్తింపును కలిగి ఉందని, తరతరాలుగా వస్తున్న ఆచారాలు, సాంస్కృతిక విలువలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు. బంజారా కులస్తులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, బంజారా సమాజ సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు