కృష్ణా జలాలపై మరోసారి తెరపైకి వివాదం..
కృష్ణా జలాలపై మరోసారి తెరపైకి వివాదం..
Sagar


నాగార్జునసాగర్, 26 ఆగస్టు (హి.స.) కృష్ణా జలాల వినియోగంపై మరోసారి ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (KRMB) ఆదేశాలను పక్కనపెట్టి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నీటి పారుదల అధికారులు... నాగార్జునసాగర్ నుంచి తాగునీటి అవసరాల కోసం నీటిని విడుదల చేసుకున్నట్లు చర్చ జరుగుతోంది. ఇవాళ ఉదయమే నాగార్జునసాగర్ కుడి కాలువ వైపు పవర్ జనరేషన్ ద్వారా తాగునీటి అవసరాల కోసం నీటిని విడుదల చేశారు ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల అధికారులు.

ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ నీటిపారుదల అధికారులు సైతం తాగునీటి అవసరాల దృష్ట్యా ఎడమ కాలువలో నీటిని విడుదల చేశారు. అయితే, తాగునీటి అవసరాల కోసమే నీటి విడుదల చేపట్టడంతో ఎలాంటి వివాదాలు, ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు వద్ద పరిస్థితిని పోలీసులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, ఇరు రాష్ట్రాల అధికారుల మధ్య ఎలాంటి ఘర్షణలు చోటుచేసుకోకుండా భద్రతా చర్యలు చేపట్టారు. ప్రస్తుతం తాగునీటి అవసరాల కోసం ఇరు రాష్ట్రాలు నీటిని వినియోగించుకోవడం మరోసారి కృష్ణా జలాల అంశాన్ని చర్చనీయాంశంగా మార్చింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande