మాదకద్రవ్యాల నిర్మూలనలో మహిళా సంఘాల పాత్ర అత్యంత కీలకం.. వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత
మాదకద్రవ్యాల నిర్మూలనలో మహిళా సంఘాల పాత్ర అత్యంత కీలకం.. వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత
Warangal cp


జనగామ, 26 ఆగస్టు (హి.స.)

మాదకద్రవ్యాల నిర్మూలనలో మహిళా సంఘాల పాత్ర అత్యంత కీలకమని, ప్రతి మహిళ తన కుటుంబంతో పాటు గ్రామాలు, పట్టణాలను డ్రగ్స్ బారిన పడకుండా కాపాడే 'సంఘమిత్ర'గా వ్యవహరించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత పిలుపునిచ్చారు. జనగామ జిల్లా సమీకృత కలెక్టరేట్లోని మెయిన్ కాన్ఫరెన్స్ హాల్లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మహిళా సంఘాల సభ్యులకు 'సంఘమిత్ర–మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన సదస్సు' నిర్వహించారు. జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, డీసీపీ రాజమహేంద్ర నాయక్లతో కలిసి కమిషనర్ శ్వేత ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్వేత మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో మహిళా సంఘాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని అన్నారు. జనగామ జిల్లాలో మహిళల చైతన్యాన్ని సామాజిక భద్రతకు వినియోగించాలని కోరారు. పోలీసుల సంఖ్యతో పోలిస్తే ప్రజల సంఖ్య అధికంగా ఉన్నందున మాదకద్రవ్యాల నిర్మూలనలో మహిళా సంఘాల సహకారం ఎంతో అవసరమన్నారు.

యువతే దేశ, రాష్ట్ర భవిష్యత్తు అని, వారిని డ్రగ్స్ కు దూరంగా ఉంచడం ప్రతి కుటుంబం, ప్రతి మహిళ బాధ్యత అని స్పష్టం చేశారు. డ్రగ్స్కు బానిసైన వారిని నేరస్తులుగా చూడకుండా చికిత్స, పునరావాసం ద్వారా సాధారణ జీవితంలోకి తీసుకురావాలని సూచించారు. ప్రతి మహిళా సంఘ సమావేశంలో డ్రగ్స్, సైబర్ నేరాలు, మహిళల భద్రత వంటి అంశాలపై తప్పనిసరిగా చర్చించాలని అన్నారు. గంజాయి విక్రయాలు, రవాణా, వినియోగం లేదా మాదకద్రవ్యాలపై ఏదైనా సమాచారం తెలిసిన వెంటనే 112కు సమాచారం ఇవ్వాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచడంతో పాటు అవసరమైతే బహుమతులు కూడా అందజేస్తామని తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande