రాజన్న ఆలయ కోడెల మృతిపై సమగ్ర విచారణకు ఆదేశం.. రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
రాజన్న ఆలయ కోడెల మృతిపై సమగ్ర విచారణకు ఆదేశం.. రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
Whip


వేములవాడ, 26 ఆగస్టు (హి.స.)

వేములవాడ రాజన్న ఆలయానికి భక్తులు సమర్పిస్తున్న కోడెలు, ఆవుల సంరక్షణ కోసం గోశాలను మరింత పటిష్టం చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. బుధవారం ఆయన గోశాలను సందర్శించారు. ఇటీవల ఐదు కోడెలు మృతి చెందిన ఘటనపై గోశాల నిర్వాహకులు, దేవాదాయ శాఖ అధికారులు, సంబంధిత పశువైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. చిన్న వయసు కోడెలను దూర ప్రాంతాల నుంచి తీసుకురావడం, వాతావరణ మార్పులు, వ్యాధులు తదితర కారణాలతో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని అధికారులు వివరించారు.

భక్తులు రాజన్నకు మొక్కు చెల్లించే ఉద్దేశంతో పాలు మరవని చిన్న కోడెలను సమర్పించకుండా ఉండాలని ఆది శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు. కనీసం ఏడాది వయసు వచ్చిన తర్వాత కోడెలను సమర్పిస్తే అవి వాతావరణానికి అలవాటు పడి అనారోగ్యానికి గురికాకుండా ఉండే అవకాశం ఉంటుందని సూచించారు. గోశాలకు కొత్తగా వచ్చే కోడెలను 15 రోజుల పాటు ప్రత్యేకంగా ఉంచి, వయసు ఆధారంగా విభజించాలని అధికారులను ఆదేశించారు. చిన్న కోడెలు, పెద్ద కోడెలను వేర్వేరుగా ఉంచేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande