
తిరుమల, 27 ఆగస్టు (హి.స.)శ్రీ వేంకటేశ్వర స్వామివారు కొలువై తిరుమల తిరుపతికి భక్తులు పోటెత్తారు. గురువారం తెల్లవారుజామున స్వామివారి దర్శనార్థం భక్తులు భారీగా పోటెత్తడంతో తిరుమల గిరులు భక్త జనసంద్రంగా మారాయి. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని కంపార్టుమెంట్లన్నీ పూర్తిగా నిండిపోవడంతో పాటు క్యూలైన్లు వెలుపల శిలాతోరణం వరకు బారులు తీరాయి. దీంతో ఎలాంటి టైమ్ స్లాట్ టోకెన్లు లేని సాధారణ భక్తులకు స్వామివారి సర్వదర్శనం లభించడానికి దాదాపు 24 గంటల సమయం పడుతోందని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు వెల్లడించారు. క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు ఎండ, అలసట బారిన పడకుండా నిరంతరాయంగా తాగునీరు, పాలు, పౌష్టికాహార అన్నప్రసాదాలను టీటీడీ సిబ్బంది నిరంతరం అందజేస్తున్నారు.
ఇదిలా ఉంటే నిన్న (బుధవారం) ఒక్కరోజే మొత్తం 77,568 మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఇందులో 35,033 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా నిన్న శ్రీవారి హుండీకి రూ.4.19 కోట్ల భారీ ఆదాయం సమకూరింది. స్వామివారి ప్రసాద విక్రయాల విషయానికొస్తే.. నిన్న ఒక్క రోజే రికార్డు స్థాయిలో 4.15 లక్షల లడ్డూలను భక్తులు కొనుగోలు చేసినట్లు అధికారులు తెలిపారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని క్యూలైన్లలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా విస్తృత ఏర్పాట్లు చేసినట్లు టీటీడీ పేర్కొంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV