నకిలీ వైద్యుల ఉచ్చులో పడకండి: సీపీ సజ్జనార్
నకిలీ వైద్యుల ఉచ్చులో పడకండి: సీపీ సజ్జనార్
Cp


హైదరాబాద్, 27 ఆగస్టు (హి.స.)

వైద్యం పేరిట అమాయక ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న నకిలీ వైద్యుల పట్ల ప్రజలంతా అత్యంత అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ హెచ్చరించారు. ప్రజారోగ్యాన్ని కాపాడే లక్ష్యంతో కల్తీ ఆహారం పై ఉక్కుపాదం మోపిన నగర పోలీసులు, తాజాగా నకిలీ వైద్యులపై ప్రత్యేక నిఘా ఉంచి 12 మందిని గుర్తించి చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకున్నట్లు ఆయన ఎక్స్ (ట్విట్టర్) వేదికగా వెల్లడించారు. ఎలాంటి అర్హతలు, కనీస వైద్య పరిజ్ఞానం లేని వీరు అసలైన వైద్యులలా నటిస్తూ యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్స్, బీపీ, షుగర్ మందులతో పాటు విచక్షణారహితంగా ఇంజెక్షన్లు, సెలైన్లు ఇస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వీరి అవగాహనారహిత చికిత్సల వల్ల ప్రజల ఊపిరితిత్తులు, గుండె, కిడ్నీలు తీవ్రంగా దెబ్బతింటున్నాయని సీపీ పేర్కొన్నారు.

నకిలీల బారిన పడకుండా ఉండేందుకు ప్రజలు క్లినిక్లు, ఆసుపత్రులకు వెళ్లినప్పుడు కొన్ని కీలక జాగ్రత్తలు పాటించాలని సీపీ సూచించారు. ఆసుపత్రుల వద్ద డీఎంహెచి (DMHO) జారీ చేసిన అధికారిక రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, వైద్యుల బోర్డులపై టీఎస్ఎంసీ (TSMC) కేటాయించిన రిజిస్ట్రేషన్ నెంబర్ ఉన్నాయో లేదో తప్పనిసరిగా సరిచూసుకోవాలన్నారు. వైద్యులపై ఏమాత్రం అనుమానం వచ్చినా అధికారిక వెబ్సైట్ (onlinetsmc.in) లో వివరాలను తనిఖీ చేసుకోవాలని, అవసరమైతే ఇతర నిపుణులైన వైద్యుల వద్ద సెకండ్ ఒపీనియన్ తీసుకోవాలని కోరారు. నకిలీ వైద్యుల సమాచారం తెలిస్తే వెంటనే డయల్ 112 లేదా సమీప పోలీస్ స్టేషన్కు సమాచారం అందించి ప్రజల ప్రాణాలను కాపాడాలని సీపీ సజ్జనార్ విజ్ఞప్తి చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande